మంత్రి సబిత ముందు మహిళా టీచర్ల కన్నీళ్లు

మంత్రి సబిత ముందు మహిళా టీచర్ల కన్నీళ్లు

హైదరాబాద్, వెలుగు: సాధ్యమైనంత త్వరగా స్పౌజ్​ బదిలీలు చేపట్టాల్సిందిగా విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డిని మహిళా టీచర్లు కోరారు. ఆదివారం వారు సబిత ఇంటికి వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. కుటుంబాన్ని వదిలి రోజూ వందల కిలోమీటర్ల దూరం లోని స్కూళ్లకు వెళ్లడం ఇబ్బందిగా ఉందంటూ మహిళా టీచర్లు మంత్రి సబిత ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. జనవరిలో సర్కారు కేవలం 615 మంది స్కూల్​ అసిస్టెంట్​ స్పౌజ్​ బదిలీలను మాత్రమే చేసిందని గుర్తు చేశారు.

 మిగిలిన 1500 ఎస్జీటీ, భాషా పండితులు, పీఈటీల స్పౌజ్​ బదిలీల విషయాన్నీ కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.  బాధితుల్లో మహిళా టీచర్లే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. కుటుంబాన్ని వదిలి వందల కిలో మీటర్లు ప్రయాణం చేస్తుండడంతో  శారీరక, మానసిక ఆందోళనకు గురవుతున్నామన్నారు. 

అనంతరం మహిళా టీచర్లు దారుస్సలాంలోని ఎంఐఎం పార్టీ ఆఫీసుకు వెళ్లి ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీకి కూడా వినతి పత్రం ఇచ్చారు. ఆయన వెంటనే లెటర్​హెడ్​పై కేసీఆర్​కు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట స్పౌజ్​ ఫోరం సభ్యులు హరీశ్​ రావుకు వినతి పత్రం ఇచ్చారు.