కాకరకాయ పేరు చెప్పగానే కొందరు ఇష్టంగా... మరికొందరు కష్టంగా... పెడతారు ముఖాన్ని. కారణం చేదు... అయితే చేదులేని ఆకాకరకాయ రుచిని ఇష్టపడేవాళ్లు కాస్త ఎక్కువమందే ఉంటారు. దీన్నే బోడ కాకరకాయ... 'ఆకాకర...పొట్టి కాకర.. అడవి కాకర అని కూడా పిలుస్తారు. ఇవి అసలు చేదుగా ఉండవు. ఈ కాలంలో విరివిగా దొరుకుతాయి.వర్షాకాలంలో దీనితో తయారు చేసిన వంటకాలు అనేక వ్యాధులను దూరం చేస్తాయి. మరింకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ కాకరకాయలతో ఈ వంటలు తయారు చేసుకోండి.
పొట్టి కాకర పకోడీ తయారీకి కావాల్సినవి
- పొట్టి కాకరకాయలు: ఐదు
- ఆలుగడ్డ: ఒకటి (కావాలంటే)
- ఉప్పు: తగినంత
- శెనగపిండి: మూడు టేబుల్ స్పూన్లు
- తెల్ల ఆవాలు: రెండు టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు: నాలుగు
- ఉల్లిగడ్డ తరుగు: పావు కప్పు
- పచ్చిమిర్చి తరుగు: రెండు టీ స్పూన్లు
- శెనగపిండి: మూడు టేబుల్ స్పూన్లు
- బియ్యప్పిండి: రెండు టేబుల్ స్పూన్లు
- పసుపు: పావు టీ స్పూన్
- కారం: ఒక టీ స్పూన్
- బేకింగ్ సోడా: చిటికెడు
- జీలకర్ర: అర టీస్పూన్
- వాము: చిటికెడు
- నూనె: సరిపడా
పొట్టి కాకర పకోడి తయారీ విధానం
తెల్ల నువ్వులను పావు గంటసేపు నానబెట్టాలి. తర్వాత నీళ్లతో పాటు నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి. పొట్టి కాకరకాయల మీద ఉండే ముళ్లను తీసేయొచ్చు లేదా అలాగే ఉంచి రెండు సగాలుగా కట్ చేయాలి.
ఆలుగడ్డను పొట్టు తీసి, కొద్దిగా ఉప్పు, పొట్టి కాకర ముక్కలతో కలిపి ఉడికించాలి. తరువాత ఆ కాకర ముక్కల్లో నుంచి గింజలను తీసేయాలి. స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, పసుపు వేసి కలపాలి.
తర్వాత చిదిమిన ఆలుగడ్డ, పొట్టి కాకర గింజలు వేసి వేగించాలి. ఆ మిశ్రమాన్ని కాకర ముక్కల్లో స్టఫ్ గా పెట్టాలి. ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, వాము, సరిపడా నీళ్లు పోసి కాస్తంత జారుగా కలపాలి.
స్టఫ్డ్ కాకర ముక్కలను శెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. చల్లటి వాతావరణంలో సాయంత్రం పూట ఈ పకోడీలు తింటే బాగుంటుంది.
బోడ కాకర ఇగురు తయారీకి కావాల్సినవి
- బోడ కాకర ముక్కలు: రెండు కప్పులు
- శెనగపప్పు: రెండు టేబుల్ స్పూన్లు
- ధనియాలు: రెండు టేబుల్ స్పూన్లు
- ఎండుకొబ్బరి తురుము: రెండు టీ స్పూన్లు
- ఉల్లిగడ్డ తరుగు: పావు కప్పు
- ఎండు మిర్చి: మూడు
- వెల్లుల్లి రెబ్బలు: ఆరు
- చింతపండు గుజ్జు (చిక్కటిది): అర టీ స్పూన్
- నూనె: సరిపడా
- పసుపు: చిటికెడు
- ఆవాలు: అర టీ స్పూన్
- మినప్పప్పు: ఒక టీ స్పూన్
- ఉప్పు: తగినంత
- కరివేపాకు: ఒక రెమ్మ
- పచ్చిమిర్చి: రెండు
బోడ కాకర ఇగురు తయారీ విధానం
శెనగపప్పు, ధనియాలు, ఎండుకొబ్బరి. తురుమును విడివిడిగా వేగించి మిక్సీలో గ్రైండ్ చేసి పక్కనపెట్టాలి. అలాగే ఉల్లిగడ్డ తరుగు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ముక్కలను కలిపి పేస్ట్ లా గ్రైండ్ చేసి, అందులో చింతపండు గుజ్జు కూడా వేసి మరోసారి రుబ్బాలి. స్టవ్ పై పాన్పెట్టి నూనె వేడి చేయాలి.
అందులో ఆకాకర ముక్కలను వేగించి, వేరే గిన్నెలో వేయాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగించాలి.
అందులో ఉల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, పసుపు, బోడ కాకరకాయ ముక్కలు, ధనియాల పొడి వేసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఈ కూర టేస్టే కాదు.. మంచి ఆరోగ్యం కూడా..
ఆ కాకర కూర తయారీకి కావాల్సినవి
- ఆ కాకరకాయలు: ఒక కప్పు
ఉల్లిగడ్డ తరుగు: అరకప్పు - కరివేపాకు: ఒక రెమ్మ
- కొత్తిమీర తరుగు: ఒక టేబుల్ స్పూన్
- ఎండుమిర్చి: ఐదు
- పసుపు: చిటికెడు
- జీలకర్ర: పావు టీ స్పూన్
- ఆవాలు: పావు టీ స్పూన్
- ఉప్పు: తగినంత
- కారం: రుచికి సరిపడా
- టొమాటో గుజ్జు: అర కప్పు
- నువ్వుల పొడి: మూడు టీ స్పూన్లు
- ధనియాల పొడి: ఒక టీ స్పూన్
- నూనె: సరిపడా
ఆ కాకరకాయల తయారీ విధానం
ఆ కాకరకాయలను శుభ్రంగా కడిగి, పొడుగ్గాకట్ చేయాలి. వాటిలో కొద్దిగా ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి సన్నని మంటపై ఉడికించాలి.
స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ తరుగు, పసుపు వేసి కలపాలి. ఐదు నిమిషాలు వేగాక టొమాటో గుజ్జు, ఉప్పు, కారం వేసి మూత పెట్టాలి. మిశ్రమం కొద్దిగా మగ్గాక నువ్వుల పొడి, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి.
రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తినేసేయొచ్చు. ఈ కూరను అన్నంలో కొద్దిగా నూనెతో కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే.. మరి ఇంకెందుకు మార్కెట్లో బోడకాకరకాయలు దొరుకుతున్నాయి.. ఈ టేస్టీ వెరైటీలను లాగించేయండి..
