
Microsoft Mega Layoffs: ప్రపంచ పెద్దన్న అమెరికా టెక్ కంపెనీలకు పెట్టింది పేరు. సిలికాన్ వ్యాలీలో పుట్టిన అనేక కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగుల కోతలతో హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మైక్రోసాఫ్ట్ 2025లో అతిపెద్ద ఉద్యోగ తొలగింపులకు ప్లాన్ చేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మైక్రోసాఫ్ట్ తన మెుత్తం గ్లోబల్ ఉద్యోగుల్లో 3 శాతం అంటే దాదాపు 6వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. దీని ద్వారా కంపెనీ తన ఆపరేషన్స్ మరింత ప్రభావవంతంగా మార్చాలని చూస్తోందని సమాచారం. జూన్ మాసంలో మైక్రోసాఫ్ట్ మెుత్తం ప్రపంచ వ్యాప్తంగా 2లక్షల 28వేల మంది ఉద్యోగులను కలిగి ఉందని వెల్లడైంది. ప్రస్తుతం కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్లో లేయర్స్ తొలగించటం ద్వారా పనిని ప్రభావవంతంగా, బాధ్యతాయుతంగా మార్చాలని చూస్తోంది.
Also Read : భారీగా తగ్గిన హోల్‌సేల్ ద్రవ్యోల్బణం
మారుతున్న మార్కెట్లకు అనుగుణంగా కంపెనీ అంతర్గతంగా అనేక మార్పులను చేపడుతోందని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. దీనికి ముందు 2023లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏకంగా 10వేల మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం మరోసారి తొలగింపులు వస్తున్నప్పటికీ ఈసారి మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్న ఉద్యోగులే ఎక్కువగా ప్రభావితం కానున్నారని తెలుస్తోంది. అలాగే కోడింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని తెలుస్తోంది.
అలాగే పనితీరు సరిగా లేక తొలగింపులకు గురైన ఉద్యోగులపై రెండేళ్ల పాటు తిరిగి హైర్ చేసుకోకుండా బ్యాన్ కూడా మైక్రోసాఫ్ట్ విధించిందని తేలింది. కొత్త విధానం కింద పెర్ఫామెన్స్ సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు దానికి మెరుగు పరుచుకునేందుకు పెర్ఫామెన్స్ ఇంప్రూమెంట్ ప్లాన్ లోకి వెళ్లటం లేదా 16 వారాల వేతనంతో ఉద్యోగాన్ని వీడటం అనే రెండు ఆప్షన్లు కలిగి ఉంటారని వెల్లడైంది. ప్రస్తుతం కంపెనీ తన ఉద్యోగులను ఎక్కువగా ఏఐ సాంకేతికతపై ఎక్కువగా డిప్లాయ్ చేస్తూ కూడా కీలక మార్పులను చేపడుతోందని వెల్లడైంది.