
Infosys Bonus News: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారతదేశంలో కూడా పరిస్థితులు ఆర్థికంగా కొంత సానుకూలంగా లేవు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఐటీ రంగంపై కొన్ని అనుకోని సమస్యలు వ్యాపార వృద్ధికి అడ్డంకులుగా మారుతున్నాయి. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా దేశంలోని టాప్ ఐటీ కంపెనీలు నియామకాల నుంచి హైక్స్ వరకు అన్ని విషయాల్లోనూ కొంత నెమ్మదిగా ముందుకెళ్లే ధోరణిని కొనసాగిస్తున్నాయి.
తాజాగా ఐటీ దిగ్గజ ఇన్ఫోసిస్ తన మార్చి త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులకు బోనస్ లెటర్లను పంపించింది. అయితే ఈ సారి ఉద్యోగులకు చెల్లించాల్సిన బోనస్ విషయంలో భారీగా కోత విధించటంపై టెక్కీలు షాక్ అయ్యారు. కంపెనీలోని అధికమంది టెక్కీలు కేవలం 50 శాతం మాత్రమే బోనస్ అందుకున్నారని వెల్లడికాగా.. చాలా తక్కువ మందికి మాత్రమే కంపెనీ 70 శాతం బోనస్ చెల్లించినట్లు తేలింది.
బోనస్ చెల్లింపులకు సంబంధించిన వివరాలను కంపెనీ అంతర్గత సమాచార వ్యవస్థ ద్వారా ఉద్యోగులకు పంచుకోగా.. దీనిని మే నెల వేతనంతో కలిపి అందుకుంటారు. కంపెనీ లెవెల్ 5, లెవెల్ 6 ఉద్యోగులకు మాత్రమే బోనస్ అందించినట్లు తెలుస్తోంది. లెవెల్ 5 కింద సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, సిస్టమ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు మాత్రమే వస్తారు. అలాగే లెవెల్ 6 కింద మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, డెలివరీ మేనేజర్లు, సీనియర్ డెలివరీ మేనేజర్లు వస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ గ్లోబల్ వ్యాపార పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సగటున 65 శాతం బోనస్ చెల్లించినట్లు వెల్లడైంది.
వాస్తవానికి ప్రస్తుతం కంపెనీ ఉద్యోగులకు అందించే బోనస్ లలో భారీగా కోతలు విధించినప్పటికీ.. ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు రానున్న హైక్ సైకిల్స్‌లో వేతన పెంపు ద్వారా రివార్డ్ చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఫిబ్రవరిలో కంపెనీ ఉద్యోగులకు కేవలం 5 నుంచి 8 శాతం మధ్య మాత్రమే వేతన పెంపులను అందించగా.. ప్రస్తుతం కంపెనీ నుంచి బోనస్ లెటర్లు రాగానే చాలా మంది ఉద్యోగులు నిరాశకు గురైనట్లు వెల్లడైంది. ఇప్పటికే టెక్ కంపెనీలు వేతన పెంపులను సైతం తాత్కాలికంగా వాయిదాలు వేసిన వేళ పరిస్థితులు దిగజారుతున్నాయని టెక్కీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.