గూగుల్ మ్యాప్‌ తో డ్రైవింగ్.. బైక్ ను ఢీకొన్న కారు

గూగుల్ మ్యాప్‌ తో డ్రైవింగ్.. బైక్ ను ఢీకొన్న కారు

గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై ముగ్గురు వ్యక్తులు బైక్ పై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పోచారంలోని ప్రముఖ ఐటీ సంస్థలో పని చేస్తోన్న 22 ఏళ్ల చరణ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చనిపోగా.. అతనితో పాటు ఉన్న ఇద్దరు స్నేహితులు గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన చరణ్ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతను వీకెండ్ లో తొమ్మిది మంది స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు టౌన్ షిప్ లో గడిపినట్టు సమాచారం. ఆ తర్వాత వారు మూడు బైక్ లపై నగరానికి వచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్ పై ప్రయాణిస్తోన్న ముగ్గురు కొత్త సెక్రటేరియట్ ను చూసేందుకు వెళ్లి, అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర కాసేపు గడిపి, ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జి దగ్గరికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. వారికి హైదరాబాద్ లోని రూట్స్ సరిగా తెలియకపోవడంతో.. ఫోన్లలో ఉన్న గూగుల్ మ్యాప్ పెట్టుకని డ్రైవింగ్ చేస్తున్నారు. అలా వారు మెహదీపట్నం వైపు వెళ్లగా.. ఆ మార్గంలో ద్విచక్రవాహనాలకు రాకపోకలు నిషేధం అని తెలియకుండా PVNR ఎక్స్‌ప్రెస్‌ వేను మార్గంగా ఎంచుకున్నారు.

ఈ ఎక్స్ ప్రెస్ వేపై రెండు, మూడు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత తాము తప్పు మార్గంలో వెళ్తున్నట్టు గర్తించారు. పిల్లర్ నంబర్ 82 వద్ద ఉన్న ర్యాంప్ పై నుంచి కిందకు దిగేందుకు చరణ్ బైక్ ను టర్న్ చేశాడు. ఇంతలోనే ఆ బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్ కు తీవ్ర గాయాలు కావడంతో దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మే 14న మృతి చెందాడు. అతని వెంటే ఉన్న ఇద్దరు స్నేహితులకు స్వల్ప గాయాలయ్యాయి.

నగర శివార్లలోని శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మెరుగైన కనెక్టివిటీని అందించడానికి 11.6కి.మీ. పొడవైన PVNR ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. ఈ మార్గంలో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, భారీ వాహనాలకు అనుమతి లేదు.