కొమురవెల్లి వద్ద హాల్ట్ స్టేషన్ ఏర్పాటుకు టెక్నికల్​ప్రాబ్లమ్

కొమురవెల్లి వద్ద హాల్ట్ స్టేషన్ ఏర్పాటుకు టెక్నికల్​ప్రాబ్లమ్
  • కొమురవెల్లి వద్ద స్టేషన్​ ఏర్పాటుకు టెక్నికల్​  ప్రాబ్లమ్​
  • గ్రేడింగ్ సమస్యపై రైల్వే అధికారుల తర్జన భర్జన 
  • టెక్నికల్ అథార్టీ  అనుమతి లభిస్తేనే హాల్ట్ స్టేషన్

సిద్దిపేట, వెలుగు: కొమురవెల్లి వద్ద రైల్వే హాల్ట్ స్టేషన్ ఏర్పాటుకు టెక్నికల్​ప్రాబ్లమ్ ​అడ్డంకిగా మారింది. రైల్వే అధికారులు విడుదల చేసిన స్టేషన్ల లిస్ట్​లో కొమురవెల్లి పేరు లేకపోవడంతో మల్లన్న దర్శనానికి రైలులో వచ్చే అవకాశం లేకుండా పోతుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల డిమాండ్ మేరకు రైల్వే స్టేషన్ ఏర్పాటుకు ఉన్నతాధికారులు సానుకూలంగా నే ఉన్నా టెక్నికల్​ ప్రాబ్లమ్​ అడ్డంకిగా మారింది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్  కొమురవెల్లి మీదుగా వెళుతోంది. ఆలయ సమీపం నుంచి లైన్ వెళుతున్నా స్టేషన్ల లిస్టులో కొమురవెల్లి లేకపోవడంపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు రైల్వే అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. దీంతో గతేడాది రైల్వే ఇన్స్ పెక్టర్ రంగనాథ్ ఫీల్డ్ విజిట్ చేసి హాల్ట్ స్టేషన్ ఏర్పాటుపై స్టడీ చేశారు. 

స్కిప్పర్​గ్రేడ్​లో నో పర్మిషన్​

రైల్వే నిబంధనల ప్రకారం ఇక్కడ రైల్వే లైన్ స్కిప్పర్ గ్రేడ్ లోకి వస్తుందని, ఇక్కడ రైలు నిలపడానికి అనుమతి ఉండదని అంటున్నారు. రైల్వే నిబంధనల ప్రకారం ట్రాక్ యూనిఫామ్ రూలింగ్ గ్రేడ్ ను ఫ్రీజ్  చేసి రైల్వే లైన్, బ్రిడ్జీల నిర్మాణాన్ని కొనసాగిస్తారు. లెవల్ గ్రేడ్ ప్రకారం ఒక రైల్వే ట్రాక్ 150 మీటర్లు దూరం తర్వాత ఒక మీటర్ అప్/ డౌన్ లేదా లెవల్ గా ఉండాలి. ఇక్కడ 150 మీటర్ల లోపలే లెవల్స్ లో తేడా ఉండి  డౌన్ గా ఉంది. దీంతో ఈ ప్రాంతం రైళ్లు నిలిపేందుకు అనుకూలంగా ఉండదు. ప్రస్తుతం కొమురవెల్లి హాల్ట్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రదేశం స్కిప్పర్ గ్రేడ్ లో ఉండటంతో స్టేషన్​ఏర్పాటుపై రైల్వే అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

టెక్నికల్ ​కమిటీ నిర్ణయంతోనే ముందుకు..

స్కిప్పర్ గ్రేడ్ లో ఉన్న ఏరియాల్లో స్పెషల్ సేఫ్టీ మెజర్స్ తో హాల్ట్ స్టేషన్  ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నా దీనిపై టెక్నికల్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  కొమురవెల్లిలో హాల్ట్​ స్టేషన్​ ఏర్పాటు చేయాలన్న డిమాండ్​ నేపథ్యంలో రైల్వే అధికారులు సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలిస్తోంది. 

వేగంగా రైల్వే లైన్ పనులు

కొమురవెల్లి వద్ద రైల్వే లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కరీంనగర్–రామగుండం రాజీవ్ రహదారి నుంచి కొమురవెల్లికి వెళ్లే రెండు రోడ్ల లో తిమ్మారెడ్డిపల్లి వద్ద రోడ్డును క్లోజ్ చేసి పనులు చేస్తుండగా, కొండపాక  నుంచి వెళ్లే రోడ్డులో రైల్వే  గేట్ తోపాటు గార్డు రూమ్  నిర్మాణం పూర్తయింది. ఈ గేటుకు సమీపంలోనే హాల్ట్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇక్కడ రైల్వే లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రతిపాదిత హాల్ట్ స్టేషన్ వద్ద రైల్వేలైన్ కు ఇరువైపులా 25 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఫ్లాట్ ఫామ్ నిర్మాణంతో పాటు అప్రోచ్ రోడ్డుకు భూమి సేకరించారు. రైల్వే లైన్ కోసం 50 మీటర్ల వెడల్పుతో సేకరించిన భూమిలోనే హాల్ట్ స్టేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

హాల్ట్ స్టేషన్ పైనే ఆశలు

ఏటా లక్షలాది మంది సందర్శించే కొమురవెల్లి వద్ద రైల్వే స్టేషన్ నిర్మించకపోయినా కనీసం హాల్ట్ స్టేషన్ ఏర్పాటు చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన లకుడారం నుంచి కొమురవెల్లికి రావాలంటే 12 కిలోమీటర్ల దూరం ఆటోల్లో రావాల్సి ఉంటుందని, కనీసం హాల్ట్ స్టేషన్ ఏర్పాటుచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొమురవెల్లి ఆలయానికి మూడు కిలో మీటర్ల దూరంలో హాల్ట్ స్టేషన్ ఏర్పాటైతే భక్తుల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా రైల్వే అధికారులు టెక్నికల్​ప్రాబ్లమ్​ను క్లియర్​చేసి 
హాల్ట్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

టెక్నికల్ ఇష్యూస్ తో నిర్ణయం పెండింగ్

కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా కొమురవెల్లి వద్ద హాల్ట్ స్టేషన్ ఏర్పాటు ఇంకా పెండింగ్ లో ఉంది. హాల్ట్ స్టేషన్ ఏర్పాటు కోసం వచ్చిన ప్రపోజల్స్ పై  రైల్వే ఉన్నతాధికారులు సానుకూలంగా ఉన్నా స్కిప్పర్ గ్రేడ్ లో లైన్ ఉండటం వల్ల టెక్నికల్ అథార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హాల్ట్ స్టేషన్  ఏర్పాటుకు అనుమతి కోసం అధికారులకు లెటర్​రాశాం. దీనిపై టెక్నికల్ అథార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతే హాల్ట్ స్టేషన్ ఏర్పాటుపై తుది ప్రకటన వెలువడుతుంది. దీనికి సంబంధించిన నిర్ణయం త్వరలోనే రావచ్చు. 

- జనార్దన్, రైల్వే ఇంజనీర్