అనాథులకు ఆకలి తీర్చే టెడ్డీ మావ 

అనాథులకు ఆకలి తీర్చే టెడ్డీ మావ 

లాక్​డౌన్​ రిలాక్సేషన్​ టైమ్​లో అందరూ కావాల్సినవి తెచ్చుకుంటున్నారు. ఒంటి గంటలోపే ఇళ్లకు పోతున్నారు. కానీ ఎవరో ఒకరు పైసలిస్తేనో, ఇంత అన్నం పెడితేనో తప్ప పొట్టనిండని బిచ్చగాళ్లు, అనాథలు, మానసిక రోగుల మాటేమిటి? రోడ్ల మీద, బస్టాండుల్లో సాయం చేసే వాళ్లకోసం దీనంగా, ఆశగా ఎదురుచూస్తున్న ఇలాంటి వాళ్ల ఆకలి తీరేదెలా? అచ్చంగా ఇలాంటి వాళ్ల కోసమే పనిచేస్తున్నారు కొందరు. ఆ కోవకే చెందుతాడు పవన్​ కుమార్. నిజామాబాద్​ జిల్లాలో అన్నార్తుల బాధలు గమనించాడు. ​గంగస్థాన్​లో ఉండే పవన్​ పట్టెడన్నం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్లకు సాయం చేయాలి అనుకున్నాడు. కానీ బయటకు వస్తే కరోనా సోకుతుందేమో అనే భయం, ఒక్క క్షణం పవన్​ ఆలోచనలకి బ్రేక్​ వేసింది. అలాగని మనసు ఊరుకోలేదు. ఇంట్లో ఉంటే తను అనుకున్న పని చేయలేను అనుకున్నాడు. వాళ్ల ఆకలి తీరుస్తూ, కరోనా సోకకుండా జాగ్రత్తపడడం ఎలా అని బాగా ఆలోచించాడు. టెడ్డీబేర్ గెటప్​ గుర్తుకొచ్చింది.  వెంటనే ఎల్లో కలర్ టెడ్డీబేర్​ గెటప్​లో రెడీ అయ్యాడు. తన ఫ్రెండ్​ అజయ్​తో కలిసి బండి మీద తిరుగుతూ అనాథలు, బిచ్చగాళ్లు, మతిస్థిమితం లేనివాళ్లకు ఫుడ్​, వాటర్​ అందిస్తున్నాడు. అలాగే హాస్పిటల్స్​ దగ్గర అటెండెంట్​లుగా ఉన్న వాళ్లకి కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు. వీళ్లకే కాకుండా లాక్​డౌన్​ డ్యూటీలో ఉన్న  పోలీసులకు కూడా టీ, స్నాక్స్, భోజనం ఇస్తున్నాడు. వైరస్​ బారిన పడకుండా  శరీరాన్ని పూర్తిగా కవర్ చేసేలా టెడ్డీబేర్​ సూట్​ తొడుక్కొని అందరూ జాగ్రత్తగా ఉండాలనే మెసేజ్​ కూడా ఇస్తున్నాడు ఈ టెడ్డీ మావ. గత 22 రోజులుగా లాక్​డౌన్​ టైంలో ఎందరికో కడుపు నింపుతున్నాడు.
అమ్మా,నాన్న సాయంతో
లాక్​డౌన్​ టైమ్​లో పస్తులుంటున్న ఏ ఆసరా లేని వాళ్ల ఆకలిని అమ్మానాన్న సాయంతో తీరుస్తున్నా.  ఇంట్లోనే ఫుడ్​ ప్రిపేర్​ చేసి రోజూ వంద మందికి అందిస్తున్నా. అందుకు రోజూ రెండు వేల రూపాయలు ఖర్చు అవుతోంది.  కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే, సాయం చేయాలనే ఆలోచనతో టెడ్డీబేర్​ గెటప్​లో రెడీ అవుతాను.  ఎవరికైనా లాక్​డౌన్​ టైంలో ఫుడ్​ కావాలంటే టెడ్డీమావ ఇన్​స్టా గ్రామ్​, యూట్యూబ్​ ఛానల్​ ద్వారా నన్ను కాంటాక్ట్​  అవ్వచ్చు. ఏ ఒక్కరు ఆకలితో బాధపడకూడదనేదే నా లక్ష్యం.  
- పవన్​ కుమార్