తీన్మార్ మల్లన్న ఆచూకీపై పోలీసులను ఆశ్రయించిన ఆయన భార్య

తీన్మార్ మల్లన్న ఆచూకీపై పోలీసులను ఆశ్రయించిన ఆయన భార్య
  • మల్లన్న ఆచూకీపై మేడిపల్లి పోలీసులను ఆశ్రయించిన ఆయన భార్య మమత
  • ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదని ఆరోపణ
  • తన భర్త ఎక్కడున్నాడో చెప్పాలని మమత డిమాండ్
  • మల్లన్నతో మాట్లాడిస్తామని హామీ ఇచ్చిన పోలీసులు
  • మల్లన్న అరెస్టుపై పోలీసులు, ప్రభుత్వంపై అభిమానులు ఫైర్

తన భర్త తీన్మార్ మల్లన్న ఆచూకీ తెలపాలని కోరుతూ ఆయన సతీమణి మమత మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. కుటుంబసభ్యులు, లాయర్లతో కలిసి వెళ్లిన ఆమె.. తన భర్త అరెస్టుకు ముందు నమోదైన ఎఫ్ఐఆర్ ను కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మల్లన్న ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, పోలీసులు అసలు అతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న సమాచారం కూడా ఇవ్వలేదని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆమెను తన భర్తతో మాట్లాడిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అరెస్టుకు ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న రూల్ కూడా పోలీసులు క్రాస్ చేశారని తీన్మార్ మల్లన్న భార్య మమత ఆరోపించారు. ఒక రౌడీలాగా, స్మగ్లర్ లాగా మల్లన్నను తీసుకుని వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ చూపించమన్నా చూపించట్లేదని మండిపడ్డారు. తాను పోలీసులను ఆరా తీయగా.. వారు తనను మల్లన్న దగ్గరికి తీసుకువెళ్తామని చెప్పినట్టు మమత తెలిపారు. కానీ ఎక్కడికి తీసుకువెళ్తున్నారన్నదని మాత్రం చెప్పలేదని చెప్పారు. మల్లన్న నిత్యం ప్రజలకు అండగా ఉంటూ, అన్యాయాన్ని ఎదురిస్తారన్నారు. తనకు కనీసం ఎఫ్ఐఆర్ కాపీ అయినా ఇస్తే లీగల్ గా పోరాటం చేస్తానని మమత చెప్పారు. ప్రశ్నించే గొంతుకను అణచకుండా, మల్లన్నపై కేసులు పెట్టకుండా, రిమాండ్ కు తీసుకెళ్లకుండా ఉండేందుకు అందరం కలిసి ఉద్యమించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. మల్లన్న అరెస్టు విషయం తెలుసుకున్న అభిమానులు.. ఆయన ఆచూకీ చెప్పకపోతే ప్రభుత్వం, పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.