బీహార్ రాజకీయాల్లో కొత్త శకం.. తేజస్వీ యాదవ్కు ఆర్జేడీ పార్టీ పగ్గాలు

బీహార్ రాజకీయాల్లో కొత్త శకం.. తేజస్వీ యాదవ్కు ఆర్జేడీ పార్టీ పగ్గాలు

బీహార్ రాజకీయాల్లో మరో కొత్త శకం మొదలైంది.  దశాబ్దాలుగా ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఆర్జేడీ పార్టీ పగ్గాలను దాదాపుగా తన కుమారుడు తేజస్వీ యాదవ్ కు అప్పగించారు. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీని విజయవంతంగా నడిపించి రాష్ట్రాన్ని ఏలిన ఆ పార్టీ చీఫ్.. పార్టీ బాధ్యతలను రెండవ తరానికి మార్పిడి చేశారు. అందులో భాగంగా తేజస్వీని వర్కింగ్ ప్రసిడెంట్ గా నియమించారు.

ఆదివారం (జనవరి 25) పాట్నాలో జరిగిన నేషనల్ ఎక్జిక్యూటివ్ మీటింగ్ లో పార్టీ బాధ్యతలను అప్పగించారు. పార్టీ సీనియర్ లీడర్ల సమక్షంలో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. లాలూ సతీమని రబ్రీ దేవితో పాటు పలువురు కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నేతల మధ్య వర్కింగ్ ప్రిసిడెంట్ బాధ్యతలను ఇచ్చారు. 

అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎక్స్ లో ఆర్జేడీ అఫీషియల్ అకౌంట్లో షేర్ చేశారు. ఆర్జేడీ ఎక్జిక్యూటివ్ ప్రిసిడెంట్ గా తేజస్వీ యాదవ్ నియామకం కొత్త శకానికి నాంది.. అంటూ ట్వీట్ చేశారు. పార్టీలో నిర్ణయాధికారం దాదాపు తేజస్వీ చేతిలోకి వచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

2025 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత.. తేజస్వీ సోదరి రోహినీ ఆచార్య రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తేజస్వీ నియామకం తర్వాత ఆమె ఎక్స్ లో సోదరుడి పేరు మెన్షన్ చేయకుండానే షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. రాజకీయాలలో పారాకాష్ట. ఒక వ్యక్తి అద్భుత ఇన్నింగ్స్ కు ఇది ముగింపు. సైకోఫాంట్స్, చొరబాటు దారుల గ్యాంగ్ చేతిలో పప్పెట్ గా మారిన యువరాజు పట్టాభిషేకం..అభినందనలు ..అంటూ పోస్ట్ చేశారు.

తేజస్వి రాజకీయ ప్రయాణం:

తేజస్వి యాదవ్ బీహార్ రాజకీయాల్లో ఎలాగోలా నెమ్మదిగా ఎదిగివచ్చిన నేత కాదు. బీహార్ అల్లకల్లోల వారసత్వ వాతావరణం నుంచి పార్టీ పగ్గాలను చేపట్టే స్థాయికి వచ్చాడు. ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు అయిన తేజస్వి.. క్రికెట్‌లో కొంత కాలం గడిపిన తర్వాత ప్రజా జీవితంలోకి ప్రవేశించాడు.  తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులలో జైలు పాలైనప్పుడు కొంత మేరకు నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. 

మొదట్లో2015లో నితీష్ కుమార్ తో కలిసి మహా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 26 ఏళ్ల వయసులో దేశంలోని అతి చిన్న వయసఉలో ఉప ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన వారిలో ఒకరు. రోడ్లు, ప్రజా పనులు వంటి మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఆ పదవి తొందరలోనే దూరమైందనే చెప్పాలి. 2017లో  నితీష్ కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు.

ఈ గ్యాప్ తేజస్విని ప్రతిపక్ష నాయకుడి పాత్రలో నిలబెట్టి రాజకీయంగా మరింత ఆరితేరేలా చేసిందనే చెప్పాలి. ఈ క్రమంలో ఆర్జేడీని పునర్నిర్మించారనే చెప్పాలి. ఆ తర్వాత బీహార్‌లో ఎన్డీఏకు ప్రధాన పోటీదారుగా తనను తాను నిలబెట్టుకున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికలలో, మహాఘట్బంధన్‌కు నాయకత్వం వహించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైనప్పటికీ ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిగా ఎదిగారు. 2022లో, నితీష్ కూటమిలోకి తిరిగి చేరి, ఉప ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. 

2025 ఎన్నికల్లో మహాగట్బంధన్ ఓడినప్పటికీ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ షేర్ సాధించిన పార్టీగా ఆర్జేడీని నిలబెట్టారు తేజస్వీ. ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా.. పార్టీ పరంగా బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ ఓట్ షేర్ సాధించి ఆశ్చర్యానికి గురిచేసింది ఆర్జేడీ. 2010 నుంచి ఎదురవుతున్న వరుస పరాజయాల పరంపర కొనసాగుతున్నా.. ఈసారి అధికార పార్టీలను మించి ఓట్ షేర్ సాధించడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అంటున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నితీస్ కుమార్ - జేడీయూ 18.87 శాతం ఓట్లు సాధించింది. అదే సమయంలో బీజేపీ 20.98 శాతం ఓట్లు రాబట్టింది. కానీ ఆర్జేడీ ఈ రెండు పార్టీల కంటే ఎక్కువ శాతం ఓట్లు రాబట్టి ఆశ్చర్యానికి గురిచేసింది. 22.84 శాతం ఓట్లతో.. ఓట్ల శాతం పరంగా ఫస్ట్ ప్లేస్ సాధించింది. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 143 స్థానాల్లో పోటీ చేసి అంత ఓటింగ్ సాధించడం టర్నరౌండ్ స్టోరీగా అనే చెప్పవచ్చు.