త్వరలో కొత్త స్కీం : ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి రూ.2 లక్షలు

త్వరలో కొత్త స్కీం : ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి రూ.2 లక్షలు

హైదరాబాద్‌, వెలుగు: ఎస్సీ, ఎస్టీల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందిస్తుం ది. ఆగస్టులో  ప్రవేశపెట్టె పూర్తిస్థాయి బడ్జెట్ లో దీనిపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. పథకం కింద ఒక్కో ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి రెండు లక్షల రూపాయల సాయం అందిం చాలని భావిస్తుంది. వందకు వంద శాతం సబ్సిడీతో.. అది కూడా నగదు రూపంలో ఇవ్వాలని కసరత్తు చేస్తున్నది. పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు, కుటీర పరిశ్రమలు, భూమి అభివృద్ధి, కొత్త వ్యాపారం ప్రారంభిం చడం, ఇప్పటికే ఉన్న వ్యాపారం విస్తరణకు ఈ సాయాన్ని ఉపయోగించుకునేలా ప్రోత్సహించనుంది. మొన్ననే ప్రకటించాల్సి ఉన్నా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలని టీఆర్ఎస్ పార్టీ భావించింది. అయితే.. సమయం సరిపోక వాయిదా వేసుకుంది. రెండువర్గాలు స్వయం సమృద్ధి సాధించేలా సరికొత్త పథకాలకు రూపకల్పన చేయబోతున్నట్టు మాత్రమే సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఇందులో కీలక స్కీంను ఆగస్టులో ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్ లో చేర్చేందుకు కసరత్తు ప్రారంభించి నట్లు సమాచారం. రాష్ట్రంలో గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కింద ఒక్కో యూనిట్ కు ప్రభుత్వం రూ. 1.25 లక్షలు అందజేస్తోంది. 20 గొర్రెలు, ఒక పొట్టేలును పంపిణీ చేస్తోంది. ఇందులో ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇస్తుండగా.. మిగతా 25 శాతం లబ్ధిదారు సమకూర్చు కోవాల్సి ఉంటుంది. గొల్లకురుమలకు లబ్ధి కలిగిస్తున్నట్టుగానే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు డైరెక్ట్ గా సాయం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 2 లక్షల విలువైన ఒక్కో యూనిట్ ను ఒక్కో కుటుంబానికి ఇవ్వాలని సంకల్పించింది. వందశాతం సబ్సిడీపై ఈ పథకాన్ని వర్తింపజేయాలని అనుకుంటోంది. ఐదేళ్ల కాలంలో ఎస్సీలకు రూ. 15 వేల కోట్ లు , ఎస్టీలకు రూ. 6 వేల కోట్లతో కొత్త పథకాల రూపకల్పన కోసం అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో సీఎం కేసీఆర్‌ ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

ఇప్పటికే కార్పొరేషన్లు, అభివృద్ధి సంస్థల ద్వారా పలు పథకాలను అందిస్తున్నా.. ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో ఆశించిన మేరకు ప్రగతి కనిపించడం లేదని సీఎం భావించారు. ఈ క్రమంలోనే సమగ్ర కుటుంబ వికాసానికి దోహద పడేలా పథకాలు రూపొందిం చాలని కడియం కమిటీకి ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో కూడిన ఈ కమిటీ పలు సూచనలు చేసినట్టుగా తెలిసింది. అందులో ప్రధానమైన పథకాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం.