మున్సిపల్ లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ సక్సెస్

మున్సిపల్ లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ సక్సెస్
  • డ్రైనేజీ క్లీనింగ్, ర్యాలీలు, పరిశుభ్రతపై అవగాహన   
  • ప్రతిరోజూ ‘ఒక చర్చ- ఒక మార్పు’ నినాదంతో కార్యక్రమాలు
  • సంక్షేమంతోపాటు ఆదాయమూ పెరిగిందంటున్న ఆఫీసర్లు       

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ శాఖలో వంద రోజుల యాక్షన్ ప్లాన్ సక్సెస్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ప్రజలకు పారిశుధ్యం, విపత్తులు, ఇతర అంశాలపై అవగాహన పెంచేందుకు వంద రోజులపాటు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. అలాగే ఈ యాక్షన్ ప్లాన్ తో మున్సిపల్ శాఖకు ఆదాయం సైతం పెరిగిందని చెప్తున్నారు. ‘తెలంగాణ రైజింగ్–-2047’ పేరుతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు100 రోజుల ప్రణాళికను అమలు చేశారు. 

ఇందులో భాగంగా పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన, ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనే విధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను నిర్మించే దిశగా ప్రతిరోజూ ‘ఒక చర్చ-–ఒక మార్పు’ అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో పట్టణాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లారు. ఈ వంద రోజుల ప్లాన్ మంచి ఫలితాలను ఇచ్చిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

చేపట్టిన కార్యక్రమాలు ఇవీ.. 

వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా 40 వేల మంది పట్టణ ప్రజలతో కలిసి అధికారులు, సిబ్బంది 250 కిలోమీటర్ల ర్యాలీలు నిర్వహించారు. 27.09 లక్షల ఇండ్లల్లో తడి, పొడి చెత్తను వేరు చేయడంతోపాటు ఇళ్లలోనే కంపోస్టింగ్ ఎరువు తయారీపై అవగాహన కల్పించారు. ‘అమృత మిత్ర’ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల్లోని 10,704 మంది మహిళలు 24,708 మొక్కలు నాటారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో శానిటేషన్ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది కోసం హెల్త్ క్యాంపులు నిర్వహించారు. 

155 క్యాంపుల ద్వారా 25,386 మంది కార్మికులకు మెడికల్ టెస్టులు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. 18,351 కిలోమీటర్ల వరదనీటి కాలువలు, నాలాలను క్లీన్ చేసింది. సీజనల్ వ్యాధులపై జాగ్రతలు, ముందస్తు చర్యల గురించి 15.02 లక్షల ఇండ్లల్లో సర్వే నిర్వహించారు. అలాగే 4,357 ఓవర్ హెడ్ ట్యాంకులను క్లీన్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. 

ఆదాయం కూడా పెరిగింది.. 

సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే ఆదాయం పెంచుకునే మార్గాలపై మున్సిపల్ శాఖ దృష్టి సారించింది. కమర్షియల్ జాబితాలో ఉంటూ రెసిడెన్షియల్ జాబితాలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న ఆస్తులను గుర్తించిన అధికారులు.. వాటిని కమర్షియల్ కేటగిరీలో ఆస్తిపన్ను చెల్లించేవిధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో 9,484 ఇండ్లను రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ కేటగిరీకి మార్చడం ద్వారా రూ.12.71కోట్ల ఆస్తి పన్ను ఆదాయం పెరిగింది.  దీంతోపాటు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న 11,140 సంస్థలను గుర్తించారు. వీటికి ట్రేడ్ లైసెన్స్ జారీచేయడం ద్వారా రూ.5.92 కోట్ల ఆదాయం వచ్చింది.  

1.39 లక్షల నల్లా కనెక్షన్లను ఆన్ లైన్ చేశారు. వీటి ద్వారా కూడా మున్సిపల్ శాఖకు ఆదాయం సమకూరిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా  కొత్తగా 2,430 స్వయం సహాయక మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు 7,978 గ్రూపులకు రూ.1,022.99 కోట్ల రుణాలను అందజేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పుడ్ ఫెస్టివల్స్ కూడా నిర్వహించారు. వీటి ద్వారా సంఘాలకు రూ.71.71 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు.