- విద్యా శాఖ పరిధిలోకి స్కిల్ యూనివర్సిటీ
- హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రగతి పద్దు మూడు రెట్లు పెంపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల దశ మార్చేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం బడ్జెట్‌లో భారీగా నిధులను ప్రతిపాదించింది. నిరుడితో పోలిస్తే హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రగతి పద్దును ఏకంగా మూడు రెట్లు పెంచడం గమనార్హం. ఈసారి బడ్జెట్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్‌కు రూ.4,650 కోట్లు, టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు రూ.685.39 కోట్లు ప్రతిపాదించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగంలో గతేడాది ప్రగతి పద్దు కింద రూ.570.59 కోట్లు కేటాయించగా, ఈసారి దానిని రూ.1,925.93 కోట్లకు పెంచారు.
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)కు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. గతేడాది ఓయూకు రూ.100 కోట్లు మాత్రమే ప్రతిపాదించగా, ఈసారి దాన్ని పది రెట్లు పెంచి రూ. వెయ్యి కోట్లకు చేర్చింది. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి గతేడాది రూ.వంద కోట్లు ప్రతిపాదించగా, ఈసారి ఆ మొత్తాన్ని రూ.400 కోట్లకు పెంచింది. ఈ రెండు యూనివర్సిటీలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు భారీగా నిధులు కేటాయించారు.
విద్యా శాఖలోకి స్కిల్ వర్సిటీ..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీని ఇప్పుడు విద్యాశాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. దీని కోసం బడ్జెట్‌లో రూ.46 కోట్లు ప్రతిపాదించారు. అలాగే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి రూ.45 కోట్లు కేటాయించారు. కళాశాల విద్యా శాఖ కోసం రూ.131 కోట్లు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం గతేడాది రూ.64.11 కోట్లు ప్రతిపాదించగా, ఈసారి రూ.146.40 కోట్లు ప్రతిపాదించారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో అన్ని విభాగాలకు నిధులు పెరిగినా, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)కు మాత్రం ప్రగతి పద్దు కింద ఎలాంటి నిధులు కేటాయించలేదు.
