V6 News

రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు

రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు

రాష్ట్రంలో హార్టీకల్చర్ పంటల సాగు పెంచేందుకు సర్కార్‌‌‌‌ నిర్ణయం 
ఉపాధి హామీ పథకానికి అనుసంధానించనున్న ప్రభుత్వం 
నరేగా జాబ్ కార్డు ఉన్న సన్న, చిన్నకారు రైతులు అర్హులు
మూడేండ్ల పాటు పంట నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో పండ్ల తోటల పెంపకాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకానికి ఉద్యాన పంటల సాగును అనుసంధానం చేసి ఆ పంటను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన మంత్రులు, ప్రిన్సిపల్‌‌ సెక్రటరీలు, ఉద్యాన, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారుల సమావేశంలో పండ్ల తోటల పెంపకంపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో హార్టీకల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ అధికారులు (మహాత్మా గాంధీ నేషనల్‌‌ రూరల్‌‌ ఎంప్లాయ్‌‌మెంట్‌‌ గ్యారంటీ యాక్ట్ (నరేగా)ను లింక్‌‌ చేసి 50 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగును చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. తాజాగా విధి విధానాలను ఖరారు చేసి సర్క్యులర్‌‌ కూడా జారీ చేశారు. రాష్ట్రంలో ఐదెకరాల్లోపు సాగు భూమి ఉన్న సన్న, చిన్న కారు రైతులకు రాయితీ కల్పించి పండ్ల తోటలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ నెల 31లోగా అర్హత, ఆసక్తి ఉన్న రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని సంబంధిత శాఖ సూచించింది. 

 

15 రకాల పండ్ల తోటలు..
రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పండ్ల తోటలకు రాయితీ కల్పిచాలని ప్రభుత్వం టార్గెట్‌‌ పెట్టుకుంది. ఇప్పటికే 8 వేల ఎకరాలను గుర్తించింది. అగ్రికల్చర్‌‌, హార్టీకల్చర్‌‌ శాఖల సమన్వయంతో టార్గెట్‌‌ను పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నది. మామిడి, నిమ్మ, బత్తాయి, జామ, సీతాఫలం, జీడి మామిడి, సపోట, ఆపిల్‌‌ బేర్‌‌, దానిమ్మ, డ్రాగన్‌‌ ఫ్రూట్‌‌ పంటలతో పాటు పొలం గట్లపై వేసుకునే కొబ్బరి తోటలు, నేరేడు, కరోంద (వాక్కాయ), చింత చెట్లు, మునగ ఇలా 15 రకాల తోటల పెంపకానికి సబ్సిడీ అందించాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఉపాధి జాబ్‌‌ కార్డు, ఐదెకరాల్లోపు సాగు భూమి ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. 


రాయితీ ఇలా..
ఎంపిక చేసిన రైతుల పొలంలో భూసార పరీక్షలు చేసి, గుంతలు తీయడంతో పాటు నిర్ణీత దూరంలో మొక్కలను ఉపాధి కూలీలతో నాటిస్తారు. పండ్ల తోటల సంరక్షణ బాధ్యతలను మూడేండ్ల పాటు ప్రభుత్వమే చూసుకోనుంది. ఒక్కో మొక్కకు అయ్యే ఖర్చు మామిడికి రూ.30, నిమ్మ రూ.25, బత్తాయి రూ.44, జామ రూ.31, సీతాఫలం రూ.26, సపోట రూ.37, మునగ రూ.15, దానిమ్మ రూ.24, కొబ్బరి రూ.36 చొప్పున రైతుకు చెల్లిస్తారు. పంట నిర్వహణ కింద ఒక మొక్కకు రూ.10, ఎరువు కింద రూ.50 ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ ఏడాది కొత్తగా డ్రిప్‌‌ ఇరిగేషన్‌‌లో కూడా రాయితీ కల్పించనుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, మిగిలిన వారికి 90 శాతం మేర సబ్సిడీపై మైక్రో ఇరిగేషన్‌‌ నిబంధన ప్రకారం డ్రిప్‌‌ పరికరాలను పంపిణీ చేయనున్నారు.


ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి..
హార్టీకల్చర్‌‌ క్రాప్స్‌‌ సాగు చేసేందుకు ఆసక్తిగా ఉన్న రైతులు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని  ఆ శాఖ జాయింట్ డైరెక్టర్​ రామలక్ష్మి సూచించారు. సాగుకు అవసరమైన టెక్నికల్‌‌ ప్రాసెస్‌‌తో పాటు సలహాలు సూచనలు అందిస్తామని పేర్కొన్నారు.