బీర్లు మస్త్ తాగుతున్నరు..జూన్​లోనూ 7.6 కోట్ల బాటిల్స్ ఖతం

బీర్లు మస్త్ తాగుతున్నరు..జూన్​లోనూ 7.6 కోట్ల బాటిల్స్ ఖతం
  • జూన్​లోనూ 7.6 కోట్ల బీరు బాటిల్స్ ఖతం 
  • సమ్మర్ ముగిసినా.. ఎండలు ఉండటంతో తగ్గని సేల్స్  
  • నిరుటి జూన్ తో పోలిస్తే.. ఈ సారి రూ. 170 కోట్లు ఎక్కువే 
  • లిక్కర్, బీర్లపై 3 నెలల్లో రూ. 9 వేల కోట్ల ఆమ్దానీ    

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో బీర్లకు డిమాండ్ తగ్గడం లేదు. కొన్ని వైన్స్, బార్లలో బీరు బాటిళ్ల స్టాక్ ఎప్పటికప్పుడు అయిపోతున్నది. వాస్తవానికి జూన్ నెలలో వానాకాలం షురూ అయి వాతావరణం చల్లబడటం వల్ల బీర్ల సేల్స్ తగ్గుముఖం పడుతుంటాయి. కానీ పోయిన నెలలో వానలు పెద్దగా పడకపోవడం, ఎండ తీవ్రత ఇంకా కొనసాగుతుండటంతో బీర్ల అమ్మకాలు అదే స్థాయిలో జోరుగా సాగుతున్నాయి. జూన్ లో మొత్తంగా 7 కోట్ల 6 లక్షల బీరు బాటిళ్లు తాగేశారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ సారి కోటి 71 లక్షల బీరు బాటిళ్లు అధికంగా తాగారు. 2022 జూన్ లో 5.89 కోట్ల బీరు బాటిళ్లు అమ్ముడుపోయాయి. అదే లిక్కర్​సేల్స్ విషయంలో మాత్రం అంతగా పెరుగుదల లేదు. గత నెలలో 30.06 లక్షల లిక్కర్ కేస్​లు మాత్రమే అమ్ముడయ్యాయి. నిరుటి జూన్ తో పోలిస్తే ఈసారి 90 వేల లిక్కర్ కేస్​లు మాత్రమే ఎక్కువగా అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఇక జూన్ లో ఆదాయం విషయానికొస్తే కేవలం బీర్ల మీదనే ఈ సారి అదనంగా రూ.170 కోట్లు వచ్చాయి. బీరు కంపెనీలు సైతం డిమాండ్​ను మించి ఉత్పత్తి చేయాల్సి వస్తోందని చెప్తున్నాయి. ఒక్కరోజు అటు ఇటు అయితే.. బీర్లు నో స్టాక్ అని బోర్డులు పెట్టాల్సి వస్తోందని వైన్స్ ఓనర్లు అంటున్నారు. ఇప్పుడు ఏ రోజుకు ఆ రోజే స్టాక్ సర్దుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.  

3 నెలల్లో రూ.9,032 కోట్లు.. 

ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల్లో రూ.9,032 కోట్ల విలువైన బీర్లు, లిక్కర్ సేల్స్ జరిగాయి. దీంతో రాష్ట్ర సర్కార్​కు దాదాపు రూ.8 వేల కోట్ల ఎక్సైజ్ ఆదాయం సమకూరింది. దీనికి తోడు వ్యాట్​తో వచ్చిన ఆదాయం అదనంగా ఉంటుంది. ఏప్రిల్​లో రూ.2,701 కోట్లు , మే నెలలో రూ.3,159, జూన్ లో రూ.3,172 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం ప్రతి నెలా 28 నుంచి 30 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతాయి. అయితే జూన్ నెలలో ఏకంగా 50 లక్షల కేసులు అమ్ముడుపోయాయి. జూన్ లో సాధారణంగా విస్కీ, బ్రాందీ ఇతర లిక్కర్ సేల్స్ పెరగాలి. కానీ జనాలు బీర్లు తాగేందుకే మొగ్గు చూపుతున్నారు. లిక్కర్, బీర్ల సేల్స్ అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఆ తరువాత వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 2,620 వైన్స్ ఉన్నాయి. వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, పర్యాటక హోటళ్లలోనూ జోరుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.