- జాతీయ సగటు కంటే మనమే బెటర్
- రిప్లేస్‌మెంట్ లెవల్ కంటే తక్కువగా సంతానోత్పత్తి
- రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్
హైదరాబాద్, వెలుగు: పిల్లలవిషయంలో తెలంగాణవాళ్లు పక్కా ప్లానింగ్‌తో ఉంటున్నారు. మెజారిటీ జంటలు ఒకరు లేదంటే ఇద్దరికే పరిమితమవుతున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–-5) ప్రకారం.. మన రాష్ట్రంలో టోటల్ ఫెర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) 1.8గా నమోదైంది. అంటే ఒక మహిళ తన జీవిత కాలంలో సగటున ఇద్దరు పిల్లల కంటే తక్కువ మందికే (1.8) జన్మనిస్తున్నది. ఇది జాతీయ సగటు 2.0 కంటే తక్కువ కావడం విశేషం. సాధారణంగా జనాభా స్థిరంగా ఉండాలంటే రిప్లేస్మెంట్ రేటు 2.1 ఉండాలి. కానీ, మన దగ్గర 1.8 ఉండటం ద్వారా జనాభా పెరుగుదల అదుపులో ఉంది.
ప్రజల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన పెరగడంతోనే ఇది సాధ్యమవుతోంది. కేంద్ర ప్రభుత్వ లెక్క ప్రకారం... దేశంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే, దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందుంజలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ కార్తికేయ శర్మ అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఉత్తరాది రాష్ట్రాల్లోనే జనాభా పెరుగుదల ఎక్కువ
ఫర్టిలిటీ రేటు తెలంగాణ 1.8, ఆంధ్రప్రదేశ్ 1.7, తమిళనాడు 1.8, కర్ణాటక 1.7, కేరళ 1.8 గా ఉన్నాయి. కానీ, ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా బిహార్‌లో అత్యధికంగా 3.0 ఫెర్టిలిటీ రేటు ఉండగా, మేఘాలయలో 2.9, ఉత్తరప్రదేశ్‌లో 2.4 గా నమోదైంది. జార్ఖండ్ లో 2.3 గా ఉన్నది. ఈ లెక్కలు చూస్తే ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్‌లో మెరుగ్గా ఉన్నాయని అర్థమవుతోంది.
అతి తక్కువ ఫెర్టిలిటీ ఉన్న రాష్ట్రాల్లో సిక్కిం (1.1), అండమాన్ నికోబార్, గోవా, లడఖ్ ప్రాంతాలు 1.3 ) ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–-4 లో దేశంలో ఫెర్టిలిటీ రేటు 2.2 ఉండగా, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-–5 లో అది 2.0కి తగ్గిందని కేంద్ర మంత్రి తెలిపారు. జాతీయ జనాభా విధానం లక్ష్యాలకు అనుగుణంగా ఈ తగ్గుదల ఉందని, తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహనే ఇందుకు కారణమని మంత్రి వివరించారు.
