జీరో డ్రాపౌట్స్లో తెలంగాణ భేష్...బాలికల విద్య, సెకండరీ స్థాయిలో 101.5 శాతంతో రికార్డ్

జీరో డ్రాపౌట్స్లో  తెలంగాణ భేష్...బాలికల విద్య, సెకండరీ స్థాయిలో 101.5 శాతంతో రికార్డ్
  •     నీతి ఆయోగ్ ‘స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టం ఇన్ ఇండియా’ నివేదికలో వెల్లడి 
  •     ప్రాథమిక స్థాయి విద్యలో జాతీయ సగటును మించి తెలంగాణ పురోగతి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రాథమిక విద్యలో 'జీరో డ్రాపౌట్స్' సాధించిన రాష్ట్రంగా దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.  నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన 'స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా' నివేదిక ప్రకారం.. గత పదేళ్లలో (2014–-15 నుంచి 2024-–25 వరకు) తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా బాలికల విద్య, సెకండరీ స్థాయిలో 101.5 శాతం నమోదుతో రాష్ట్రం రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 43,154 పాఠశాలలు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. అందులో 20,521 ప్రాథమిక పాఠశాలలు (1నుంచి-5 తరగతులు), 7,705 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. 

సెకండరీ స్థాయిలో 6,401 పాఠశాలలు ఉండగా, కేవలం 6 నుంచి 10వ తరగతి వరకు బోధించే స్కూళ్లు 5,222 ఉన్నాయి. కాగా, ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఒకే చోట విద్యాభ్యాసం అందించే సమగ్ర పాఠశాలలు 974 ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బాలికల విద్యలో తెలంగాణ అద్భుతమైన వృద్ధిని కనబర్చింది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో బాలికల గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (GER) జాతీయ స్థాయిలో 115.6 శాతంగా నమోదైంది. ఈ రిపోర్ట్ లో తెలంగాణ విద్యా రంగంలో అనేక మార్పులతో ముందు వరుసలో నిలిచింది. ఇందులో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ లెవల్స్ లో స్టూడెంట్స్ నమోదు (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో- జీఈఆర్) జాతీయ సగటును మించి అగ్రగామి రాష్ట్రాలతో పొటీ పడింది.  

బాలికలు ముందజ.. 

బాలికల విద్యలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. 2024–25 ఎడ్యూకేషన్ ఇయర్ లో  ప్రాథమిక స్థాయిలో బాలికల జీఈఆర్ జాతీయ స్థాయిలో 115.6 శాతంగా రికార్డు నమోదు చేసింది. ఇదే సందర్భంలో ప్రాథమికోన్నత స్థాయిలో బాలికల నమోదు గడిచిన పదేండ్లలో 88.91 శాతం నుంచి ఏకంగా 113.4 శాతానికి పెరిగింది. అలాగే సెకండరీ స్థాయిలో 78.58 శాతం నుంచి 101.5 శాతానికి, హయ్యర్ సెకండరీలోనూ బాలికల నమోదు 49.58 శాతం నుంచి 71.3 శాతానికి  గణనీయంగా పెరిగింది. 'ట్రాన్సిషన్' రేటులో తెలంగాణ ఉత్తమ ఫలితాలు సాధించింది. ప్రాథమిక స్థాయిలో డ్రాపౌట్ రేటు దాదాపు సున్నా శాతంగా నమోదైంది. ఇదే సందర్భంలో  సెకండరీ స్థాయికి (9, 10 తరగతులు) వచ్చేసరికి బడి మానేస్తున్న వారి శాతం 13.2గా రికార్డు అయ్యింది. 

ఇది జాతీయ సగటు (11.5శాతం) ను దాటడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు స్కూల్స్ లో స్టూడెంట్స్ నమోదు ‘గ్రాస్  ఎన్ రోల్ మెంట్ రేట్’ (జీఈఆర్) వృద్ధి నమోదు చేసింది. ప్రాథమిక స్థాయిలో 2014–15లో 105.64 శాతంగా ఉన్న జీఈఆర్, 2024–25 నాటికి 114 శాతానికి పెరిగింది. ప్రాథమికోన్నత స్థాయిలోనూ 87.92 శాతం నుంచి 111.6 శాతానికి పెరిగింది. ఇదే సందర్బంలో సెకండరీ స్థాయిలో 76.7 శాతంగా ఉన్న జీఈఆర్,  ఇప్పుడు 99.9 శాతానికి చేరింది. హయ్యర్ సెకండరీ విభాగంలోనూ 49.58 శాతం నుంచి 67.6 శాతానికి పెరగడం తెలంగాణలో విద్యా రంగ అభివృద్ధిని సూచిస్తోంది. 

92.9% బాలికల మరుగుదొడ్లు

బడులలో సౌకర్యాల కల్పనలోనూ రాష్ట్రం పురోగమించింది. గత పదేళ్లలో బాలికల మరుగుదొడ్ల సౌకర్యం 70.7 శాతం నుంచి 92.9 శాతానికి, బాలుర మరుగుదొడ్లు 57 శాతం నుంచి 86.7 శాతానికి పెరిగాయి. విద్యుత్ సదుపాయం ఉన్న పాఠశాలలు 95.1 శాతానికి చేరాయి. దాదాపు 86 శాతం పాఠశాలల్లో కంప్యూటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటికి ఇంటర్నెట్ సౌకర్యం మాత్రం కేవలం 43.3 శాతానికే పరిమితమైందని నీతి ఆయోగ్ నివేదిక ఎత్తిచూపింది. అలాగే దివ్యాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల ఏర్పాటు (కేవలం 6.8 శాతం) పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.