పెట్టుబడి తగ్గాలే... దిగుబడి పెరగాలే..

పెట్టుబడి తగ్గాలే... దిగుబడి పెరగాలే..
  • రాష్ట్రంలో ప్రయోగాత్మక సాగుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ

నల్గొండ,వెలుగు : పంట సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గించి, దిగుబడులు పెంచే లక్ష్యంతో వ్యవసాయశాఖ  సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అమెరికా, చైనా లాంటి దేశాలతో పోల్చినప్పుడు మన రాష్ట్రంలో  వరి, పత్తికి పెట్టే పెట్టుబడులకు, వచ్చే దిగుబడులకు చాలా తేడా ఉంటోంది. దీనిని అధిగమించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది.  ఇటీవల  వానాకాలం సాగు సన్నాహక సదస్సుల తర్వాత ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. రాష్ట్రంలో ప్రధానంగా సాగవుతున్న పత్తి, వరి పంటలకు అయ్యే పెట్టుబడి ఖర్చులు తగ్గించి, దిగుబడులు పెంచేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి శాస్త్రవేత్తలు, వ్యవసాయ సిబ్బంది, విత్తన కంపెనీలు ఏకతాటిపైకి వచ్చాయి.  ఇందులో భాగంగా రాష్ట్రంలో   2,604 క్లస్టర్లకు గాను ఒక్కో క్లస్టర్​ పరిధిలో 155 మంది రైతులకు మించకుండా 400 ఎకరాల్లో వరి, అత్యధికంగా పత్తి సాగయ్యే జిల్లాలో కనీసం 5 వేల నుంచి 10 వేల ఎకరాల్లో పత్తి పంటను ప్రయోగాత్మకంగా సాగుచేయనున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన రైతులకు వ్యవసాయశాఖ ఆఫీసర్లు, శాస్త్రవేత్తలు అవసరమైన సాంకేతిక సాయంతో పాటు ఎప్పటికప్పుడు  సలహాలు, సూచనలు అందిస్తారు. 

కూలీల ఖర్చు ఆదా...
వరి సంప్రదాయ సాగులో  ముందుగా నారు పోసి, నారు ఎదిగాక బురద మడులు సిద్ధం చేసి నాటు వేస్తారు. ఇప్పటిదాకా మన రైతులంతా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. కానీ ఈసారి ప్రతి క్లస్టర్​పరిధిలో ఎంపిక చేసిన 400 ఎకరాల్లో నాలుగు రకాల అధునాతన పద్ధతుల్లో వరి సాగు చేయనున్నారు. మొదటి 50 ఎకరాల్లో వెదజల్లే పద్ధతి (డైరెక్ట్ సీడింగ్) విధానంలో వరి పండిస్తారు. అంటే నాట్లు వేయకుండా డైరెక్ట్​గా విత్తనాలు వెదజల్లుతారు. దీని వల్ల కూలీల ఖర్చు ఎకరానికి ఏడు వేల నుంచి 8 వేల వరకు ఆదా అవుతుందని అధికారులు అంటున్నారు. పైగా ఎకరానికి 12 కిలోల విత్తనాలు సరిపోతాయని చెప్తున్నారు. మరో 100 ఎకరాల్లో మామూలు పద్ధతిలో వరి వేసి రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గిస్తారు. వాటి స్థానంలో జీవ ఎరువులను వాడతారు. వీటి వల్ల పంట వేర్లు అభివృద్ధి చెంది, వాటి వద్ద  ఏర్పడే బొడిపెల ద్వారా గాలిలోని నత్రజని, నేలలోని భాస్వర్వాన్ని సహజంగా తీసుకొని పంటలు ఎదుగుతాయి. కిలో ఎరువు ఖర్చు రూ.200 మించదు. పైగా దిగుబడులు కూడా అధికంగా ఉంటాయి. ఇది ఒక రకంగా సేంద్రియ విధానమే. మరో వంద ఎకరాల్లోనూ సహజ పద్ధతిలో నాటు వేసి నత్రజనిని రెండు సార్లకు బదులు దశల వారీగా నాలుగైదుసార్లు కొద్దికొద్దిగా పంటకు అందిస్తారు. మరో 150 ఎకరాల్లో ముందుగా  జీలుగు, జనుము, పిలిపెసర, పెసర, వంటి పచ్చిరొట్ట విత్తనాలు సాగుచేస్తారు. వాటిని అదే నేలలో కలియదున్ని నాటు వేస్తారు. ఇది కూడా ఒకరకంగా సేంద్రియ విధానమే. ఇందులోనూ ఎరువుల ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరుగుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. 

ఎకరాకు 16 క్వింటాళ్ల  పత్తి దిగుబడి.. 
పత్తి ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో 5వేల నుంచి 10వేల ఎకరాల్లో ఈసారి హైడెన్సిటీ ప్లాంటింగ్​ను ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. ఇప్పటివరకు పత్తి ప్రతి ఎకరాకు 12వేల నుంచి 15వేల మొక్కలు వచ్చేలా సీడ్ ​వేస్తున్నారు. ఇందుకు 2 నుంచి రెండున్నర సీడ్ ​ప్యాకెట్లు సరిపోతాయి. కానీ హైడెన్సిటీ ప్లాంటింగ్​లో ఎకరాకు కనీసం 22 వేల నుంచి 25 వేల మొక్కలు వచ్చేలా ఐదు ప్యాకెట్ల సీడ్​ వేస్తారు. దీని వల్ల సీడ్​ ఖర్చు పెరుగుతుంది గనుక అదనంగా అవసరమయ్యే మూడు ప్యా కెట్లను రైతులకు ఉచితంగా ఇచ్చేలా వివిధ సీడ్​ కంపెనీలతో సర్కారు అగ్రిమెంట్ ​చేసుకుంది. సెలక్ట్ చేసిన కంపెనీ విత్తనాలను రైతులు సొంత ఖర్చుతో కొని, నాటుకున్నాక కంపెనీలు రాయితీ రిలీజ్ చేస్తాయి.  నల్గొండ జిల్లాలో ఐదు వేల ఎకరాల్లో విత్తనాలు సప్లై చేసేందుకు రాశి, నూజివీడు కంపెనీలు ముందుకువచ్చాయి. ఇక వ్యవసాయశాఖ అధికారుల పర్యవేక్షణలో ‘గ్రోత్ రెగ్యులరేట్ స్ప్రేయింగ్​’ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ విధానంలో ఇష్టానుసారంగా పురుగు మందులు పిచికారీ చేయకుండా మొక్క దశను బట్టి స్ప్రే చే యాలి. దీనివల్ల చేనంతా ఒకేసారి పూతకు వస్తుంది. ఒకేసారి పత్తి తీస్తే సరిపోతుంది. రెండు, మూడుసార్లు పత్తి తీయాల్సిన అవసరముండదు. హార్వెస్టింగ్​ సిస్టమ్​లో యంత్రాలతోనే పత్తిని తీస్తారు.  దీంతో కూలీల ఖర్చు మిగులుతుంది. పైగా ఎకరాకు 16 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అధికారులు చెప్తున్నారు.