- ఈ నెల 20న డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఏఐ రంగంలో నూతన ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్’ను దావోస్‌లో ఆవిష్కరించనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా ఈ నెల 20న దావోస్‌లోని మౌంటెన్ ప్లాజా హోటల్‌లో రాత్రి 7 నుంచి 8:30 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. దీనికి పలు దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. ప్రపంచంలోనే తొలి ‘గ్లోబల్ ఏఐ సాండ్‌బాక్స్’గా ఈ సంస్థ పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ రంగానికి కేంద్రంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు ప్రపంచ నూతన ఆవిష్కరణల రాజధానిగా మారిపోతుంది. దావోస్‌లో మేం కేవలం పెట్టుబడులు మాత్రమే అడగడం లేదు.. భాగస్వామ్యాలను కోరుకుంటున్నాం” అని తెలిపారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే ఉన్న ఇంక్యుబేటర్ల తరహాలో కాకుండా ప్రపంచానికి ఒక ‘ఇన్నోవేషన్ సాండ్ బాక్స్’ అవసరం. డీప్‌టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, చిప్ డిజైన్ వంటి రంగాల్లో అత్యాధునిక ఆవిష్కరణలకు వేదికగా తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ నిలుస్తుంది” అని పేర్కొన్నారు. ప్రపంచంలోని టాప్-20 ఇన్నోవేషన్ హబ్‌లలో ఒకటిగా తెలంగాణను నిలపడమే తమ లక్ష్యమని తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ సీఈవో ఫణి నాగార్జున తెలిపారు.
