- ఈ టార్గెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తుంది: గవర్నర్ జిష్ణుదేవ్
- సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తున్నదని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: నిర్ణీత లక్ష్యాలు నిర్దేశించుకొని తెలంగాణ ముందుకెళ్తున్నదని, 2047లోగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్నదే లక్ష్యమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఈ టార్గెట్‌ను ప్రభుత్వం సాధిస్తుందని తెలిపారు. కొత్త ఎయిర్ పోర్టులు, రెన్యువెబుల్ ఎనర్జీ, రవాణా వ్యవస్థలు, స్మార్ట్ జోనింగ్ తో తెలంగాణ ఆధునిక రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నదని, 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి కావాల్సిన మౌలిక వసతులన్నీ సమకూర్చుకుంటున్నదని తెలిపారు.
స్థిరమైన, స్పష్టమైన విధానాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు, ఆవిష్కరణలు తరలివస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రైజింగ్ , వికసిత్ భారత్ లక్ష్యాలు దేశానికి ఆదర్శంగా మారుతాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని కొనియాడారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయి, ప్రారంభించారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంతో కలిసి వివిధ శాఖల స్టాల్స్‌ను గవర్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ ‘‘వికసిత్ భారత్ - 2047, తెలంగాణ రైజింగ్ అనేవి కేవలం నినాదాలు కాదు.. అవి స్పష్టమైన లక్ష్యాలు. బలమైన విజన్ ఆచరణలోకి మారుతున్న శుభ తరుణం ఇది. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే స్ఫూర్తితో.. లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచించడం, వాటిని క్రమశిక్షణతో అమలు చేయడం తెలంగాణలో కనిపిస్తున్నది. స్పష్టత, భవిష్యత్ మీద దృష్టి ఉంటేనే ఇవన్నీ సాధ్యం. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలతో మమేకం కావడం వల్ల.. సామాన్యులకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతున్నది.
ప్రభుత్వం అనేది ప్రజలకు సేవకుడిగా, ధర్మకర్తగా వ్యవహరించాలి. అప్పుడే విశ్వాసం బలపడుతుంది” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ‘సమ్మిళిత వృద్ధి’ అనే లైన్‌ను ఎంచుకున్నదని, సీఎం రేవంత్ నాయకత్వంలో మహిళలు, రైతులు, యువత, పిల్లలను ఈ అభివృద్ధిలో భాగస్వాములను చేశారని చెప్పారు.
మహిళా సాధికారతలో తెలంగాణ కొత్త పుంతలు తొక్కుతు న్నదని తెలిపారు. ‘‘స్వయం సహాయక సంఘాల మహిళలే స్వయంగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. సోలా ర్ ప్రాజెక్టులు, రిటైల్ రంగాల్లో రాణిస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థలో వారు క్రియాశీలక భాగస్వాములయ్యారు. పర్యావరణ పరిరక్షణ, చెరువుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుతున్నారు.”అని పేర్కొన్నారు.
గాంధీ స్ఫూర్తితో విద్యావిధానం
మహాత్మా గాంధీ కలలు కన్న ‘యంగ్ ఇండియా’ స్ఫూర్తితో.. రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణలో కమ్యూనిటీని భాగస్వామ్యం చేస్తున్నారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. యూనివర్సిటీల్లో నైపుణ్యాలు, క్రీడల ద్వారా యువతను భవిష్యత్ సవాళ్లకు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఒకేషనల్, టెక్నాలజీ ఆధారిత శిక్షణతో పరిశ్రమలకు కావాల్సిన నిపుణులైన మానవ వనరులను ఈ ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని చెప్పారు. ‘‘గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావడం, మహిళా చేతివృత్తుల వారి కోసం రెస్ట్ సెంటర్లు ఏర్పాటు చేయడం.. మారుతున్న కాలానికి, అవసరాలకు ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో చెప్పడానికి నిదర్శనం” అని అన్నారు. ప్రధాని మోదీ ఆశించిన సమ్మిళిత వృద్ధి, సుస్థిరత, ఆవిష్కరణల బాటలోనే రాష్ట్రం పయనిస్తున్నదని గవర్నర్ పేర్కొన్నారు.
