విద్యార్థులను ప్రపంచంతో పోటీపడేలా చేస్తం : భట్టి

విద్యార్థులను ప్రపంచంతో పోటీపడేలా చేస్తం : భట్టి
  • విద్యా రంగానికి రూ.25 వేల కోట్లు కేటాయించాం: భట్టి
  • అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకుల స్కూల్స్  నిర్మిస్తున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యా రంగానికి బడ్జెట్​లో రూ.25 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. చెన్నైలో మంగళవారం ఓ ప్రముఖ సంస్థ విద్యా రంగంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో గురుకుల విద్యావ్యవస్థ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నదన్నారు. అందులో భాగంగా యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్ స్కూల్స్​ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. 

కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ పాఠశాలలో అడ్మిషన్లు ఇస్తామని వెల్లడించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో ఒక్కో పాఠశాలను నిర్మిస్తున్నామన్నారు. క్రికెట్, ఫుట్ బాల్  మైదానాలు తదితర సౌకర్యాలు ఉంటాయన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సినిమా ప్రదర్శించేందుకు థియేటర్ కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. లక్షల సంఖ్యలో ఇంజినీరింగ్  కోర్సు పూర్తి చేసుకుని బయటికి వస్తున్న విద్యార్థుల్లో మల్టీ నేషనల్ కంపెనీలు ఆశిస్తున్న స్కిల్స్ లేకపోవడంతో ఉపాధి కష్టంగా మారుతోందన్నారు. 

దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ని స్థాపించిందన్నారు. కాగా.. ప్రజాస్వామ్యం,ఫెడరల్  వ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు. కేంద్రంతో బలమైన సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అయితే, విధానపరమైన అంశాలపై ఎప్పటికీ పోరాడుతామని వెల్లడించారు. ఇక, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఏ పార్టీ కూడా కనిపించడం లేదని, ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదన్నారు. ఫార్ములా ఈ- కార్  రేసులో రాజకీయంగా తాము చేసిందేమీ లేదని, ప్రజాధనం దుర్వినియోగమైందన్న ఆరోపణలతో కేటీఆర్​పై కేసు నమోదు చేశారని తెలిపారు. ఆయనపై శాఖాపరమైన విచారణ జరుగుతున్నదని డిప్యూటీ సీఎం చెప్పారు.