హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా ప్రభుత్వం భారీ ప్రణాళికలను రెడీ చేసింది. 2027లో రానున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం 2026–27 బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాయించింది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్నాయి. సుమారు 8 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
పుష్కరాల నిర్వహణ, రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం వంటి పనులను పర్యవేక్షించడానికి మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక కేబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేసింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. కాగా, 2025–26 బడ్జెట్‌లో మొత్తం రూ.300 కోట్లు కేటాయించింది. అయితే, ఈసారి అవసరానికి అనుగుణంగా మంజూరు చేస్తామని ప్రకటించింది. గోదావరి పుష్కరాలు రానుండటంతో ఘాట్ల అభివృద్ధితోపాటు గోదావరి పరీవాహక ఆలయాలపై ఫోకస్ పెట్టింది.
- 9 పవిత్ర యాత్రా సర్క్యూట్లు..
ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దేవాదాయ, టూరిజం శాఖ సంయుక్తంగా 9 కొత్త పవిత్ర యాత్రా సర్క్యూట్లను ప్రారంభించాయి. భద్రాచలం, ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయడంతో పాటు రాజన్న ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు.
