ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ హబ్‌‌‌‌గా తెలంగాణ: మంత్రులు శ్రీధర్‌‌‌‌బాబు, దామోదర రాజనర్సింహ

ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ హబ్‌‌‌‌గా తెలంగాణ: మంత్రులు శ్రీధర్‌‌‌‌బాబు, దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో భారీ స్థాయిలో ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ హబ్‌‌‌‌లు ఏర్పాటు కానున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌బాబు చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌‌‌‌ మండలం తొగర్‌‌‌‌ గ్రామ శివారులో కేజేఎస్‌‌‌‌ ఇండియా ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్‌‌‌‌ యూనిట్‌‌‌‌కు శుక్రవారం మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రూ.650 కోట్లతో 44 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ యూనిట్‌‌‌‌ ద్వారా ప్రత్యక్షంగా 1,500 మందికి, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. జహీరాబాద్‌‌‌‌ను కేంద్రంగా చేసుకొని నిమ్జ్‌‌‌‌ను అతిపెద్ద పారిశ్రామిక కారిడార్‌‌‌‌గా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. 65 శాతానికి పైగా యువత నైపుణ్యాలను వినియోగించుకొని తెలంగాణను మరింత శక్తివంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

వ్యవసాయ ఆధారిత ప్రాంతాలను గుర్తించి విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ పటాన్‌‌‌‌చెరు ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్‌‌‌‌రావు, సురేశ్‌‌‌‌ షెట్కర్‌‌‌‌, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీజీఐఐసీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ నిర్మలరెడ్డి, సెట్విన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ గిరిధర్‌‌‌‌రెడ్డి, కలెక్టర్‌‌‌‌ ప్రతీక్‌‌‌‌ జైన్‌‌‌‌, ఎస్పీ పరితోష్ పంకజ్, టీజీఐఐసీ ఎండి. శశాంక్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కంపెనీ చైర్మన్‌‌‌‌ గిరీశ్‌‌‌‌ జైన్‌‌‌‌ పాల్గొన్నారు.

సీఎం నేతృత్వంలో ఒక్కతాటిపైనే ఉన్నాం
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు మీడియాతో మాట్లాడుతూ... సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి నేతృత్వంలో మంత్రులంతా ఒక్కతాటిపైనే ఉన్నామన్నారు. కేబినెట్‌‌‌‌లో అందరం కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నామని, సీఎం, మంత్రులు అందరం కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. బీజేపీ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతోందన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌‌‌‌కు లేదన్నారు.