Telangana Elections 2023 : తెలంగాణలో మొదలైన పోలింగ్

Telangana Elections 2023 :  తెలంగాణలో మొదలైన పోలింగ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది.  ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే  పోలింగ్ కేంద్రాలు ముందు బారులు తీరారు.  ఓటు వేసేందుకు 35 వేల 655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్  సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.  మావోయిస్టు ప్రభావితమైన 13 నియోజకవర్గాలలో  సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో కంటే ఈ సారి ఎక్కువ ఓటింగ్ జరిగేలా చూస్తుంది ఈసీ.  

రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా.. వివిధ పార్టీల, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి 2,290 మంది బరిలో ఉన్నారు. వీరిలో 2,068 మంది పురుషులు కాగా, 221 మంది మహిళా అ‌భ్యర్థులు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు. అత్యధికంగా ఎల్బీనగర్ లో 48 మంది పోటీలో ఉంటే.. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఏడుగురు చొప్పున పోటీ చేస్తున్నారు. 

ఇక బీఆర్ఎస్ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ఈ పార్టీ నుంచి 8 మంది మహిళలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 118 స్థానాల్లో పోటీ చేస్తుండగా, 12 మంది మహిళలు..  బీజేపీ 111 స్థానాల్లో పోటీలో ఉండగా, 13 మంది మహి‌‍ళలు బరిలో ఉన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుండగా, వీరిలో ఒక మహి‌ళా అభ్యర్థి ఉన్నారు. కాగా, 2018 ఎన్నికల్లో 1,777 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 

రాష్ట్రంలో మొత్తం 3,26,18,205 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,63,13,268 మంది పురుషులు కాగా.. 1,63,02,261 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో 2,676 మంది థర్డ్ జెండర్. ఇక కొత్తగా ఓటు హక్కు పొందినోళ్లు 9,99,667 ఉండగా.. 80 ఏండ్లు పైబడిన ఓటర్లు 4,40,371 మంది. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7,32,506 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో 1,48,713 మంది ఓటర్లు ఉన్నారు