- రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి
- ఈ నెల 31న అప్రొప్రియేషన్ బిల్లు.. బీఏసీ మీటింగ్‌లో నిర్ణయం
- సమయం లేనందునే తక్కువ రోజులు సభ పెడ్తున్నం: శ్రీధర్‌బాబు
- శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతికత బీఆర్‌ఎస్‌కు లేదు
- నాడు లాయర్లను నడిరోడ్డుపై నరుకుతుంటే ఏంచేశారని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: బడ్జెట్ సమావేశాలను 8 రోజులపాటు నిర్వహించాలని అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) నిర్ణయించింది. ఈ నెల 25న డిప్యుటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌పై ఎమ్మెల్యేలు ప్రిపేర్ అయ్యేందుకు ఆ మరుసటి రోజును సెలవుగా ప్రకటించారు. ఈ నెల 27 బడ్జెట్‌పై చర్చించడంతోపాటు అదేరోజు ఆర్థిక మంత్రి రిప్లై ఇవ్వనున్నారు. మరుసటి రోజు ఆదివారం సభకు సెలవు ఇచ్చారు. సోమవారం, మంగళవారం బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. బుధవారం అప్రొప్రియేషన్ బిల్లుపై చర్చించి, సభ ఆమోదం పొందనున్నారు.
మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమావేశంలో పాల్గొన్నారు. సభ నిర్వహణపై చర్చించారు. అనంతరం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సమావేశం నుంచి అసంతృప్తిగా బయటకు వచ్చారు. సభను ప్రభుత్వం వారంపాటే నడిపించాలని భావిస్తున్నదని, ఇది సరికాదని అన్నారు. కనీసం 15 రోజులు సెషన్స్ నిర్వహించాలని కోరారు.
31లోపే తప్పనిసరిగా బడ్జెట్‌ను ఆమోదించాలి: మంత్రి శ్రీధర్‌బాబు
బడ్జెట్‌ను ఈ నెల 31వ తేదీ లోపే తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉందని, లేదంటే ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించే పరిస్థితి ఉండదని లెజిస్లేటివ్ అఫైర్స్ (ఎల్‌ఏ) మినిస్టర్ శ్రీధర్‌బాబు తెలిపారు. సభ ఎక్కువ రోజులు నిర్వహించాలని ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా 31వ తేదీ నాటికే ముగించాల్సి వస్తున్నదని చెప్పారు. ఒకవేళ అవసరం అనుకుంటే సభను స్పీకర్ పొడిగిస్తారని, బడ్జెట్ కాకుండా ఇతర అంశాలపై అప్పుడు చర్చించవచ్చునని చెప్పారు. కాంగ్రెస్ ఎల్పీ హాల్‌లో శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు అన్ని విషయాలు తెలిసి కూడా తిమ్మినిబమ్మి చేసి విమర్శలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను ఏడెనిమిది రోజులకు మించి నిర్వహించలేదని తెలిపారు.
బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక సమావేశాలను వారానికి కుదించిందని అన్నారు. ఇప్పుడు 15 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ నేతలు అడగడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. లాయర్ వామన్‌రావు దంపతులను నడిరోడ్డుపై నరికి చంపుతున్నప్పుడు మాట్లాడని బీఆర్‌ఎస్ నాయకులకు, శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో చెట్టాపట్టాల్ ఏసుకుని తిరిగిన బీఆర్ఎస్.. అప్పుడెందుకు కేంద్ర బడ్జెట్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను తేలేదని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిస్తేనే వాళ్లకు దగ్గర అయినట్టైతే, మోదీని కేసీఆర్ ఎన్నిసార్లు కలిశారు? వాళ్లు ఎంత దగ్గరైనట్టు? అని నిలదీశారు. సభను హుందాగా నడిపిస్తామని, ప్రతిపక్షాలకు సమయం ఇస్తామని అన్నారు.
