- సిరీస్‌పై టీమిండియా గురి
- సూర్య, గిల్‌పై ఫోకస్
- రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
అహ్మదాబాద్: కెప్టెన్ సూర్యకుమార్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌పై అందోళన కొనసాగుతుండగా సౌతాఫ్రికాతో ఫైనల్ పోరుకు ఇండియా రెడీ అయ్యింది. శుక్రవారం జరిగే ఐదో, చివరి టీ20 పోరులో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. లెక్క సరిచేయాలని ప్రొటీస్ పట్టుదలగా కనిపిస్తోంది. సఫారీల చేతిలో 0–2తో టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఇండియా వన్డే సిరీస్‌ను గెలిచి కాస్త ఉపశమనాన్ని కలిగించింది. ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంటే టీ20 వరల్డ్ కప్ ముంగిట జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. పొగమంచు వల్ల నాలుగో టీ20 రద్దు కావడంతో ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
అయితే సూర్యకుమార్ ఫామ్‌పై తీవ్ర ఆందోళన కొనసాగుతోంది. ఈ ఏడాది 20 మ్యాచ్‌లు ఆడిన అతను 18 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. 14.20 సగటుతో 213 రన్స్ మాత్రమే చేశాడు. దీనికి తోడు శుభ్‌మన్ గిల్ టీ20 సెటప్‌కు సరిపోవడం లేదు. అతని కోసం ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మతో మంచి జోడీ కుదిరిన శాంసన్‌ను తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం బొటన వేలి గాయంతో ఇబ్బందిపడుతున్న గిల్ ఈ మ్యాచ్‌లో ఆడటంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఒకవేళ తను ఆడకపోతే శాంసన్‌కు లైన్ క్లియర్ అవుతుంది. లోయర్ ఆర్డర్‌లో శాంసన్ రికార్డు అంత మెరుగ్గా లేదు. ఐదో ప్లేస్‌లో బ్యాటింగ్ చేసిన అతను 8 మ్యాచ్‌ల్లో 23 సగటుతో 138 రన్స్ చేశాడు. కానీ టాప్ ఆర్డర్‌లో మాత్రం ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించాడు. మిగతా లైనప్‌లో తిలక్ వర్మ, జితేష్ శర్మతో పాటు ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. మూడో టీ20కి దూరమైనా నాలుగో మ్యాచ్‌కు ముందు జట్టుతో చేరిన స్టార్ పేసర్ బుమ్రా తుది జట్టులో ఆడే చాన్స్ ఉంది. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాతో పేస్ బలగం బలంగా కనిపిస్తోంది. అక్షర్ పటేల్ లేకపోవడంతో సుందర్, వరుణ్ చక్రవర్తి స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు.
మార్‌క్రమ్ ముందుకు..
ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా లైనప్‌లో కొద్దిగా మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఓపెనింగ్‌లో ఫెయిలవుతున్న హెండ్రిక్స్ ప్లేస్‌లో మార్‌క్రమ్‌ను ఆడించొచ్చు. డికాక్, బ్రెవిస్, మిల్లర్ బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. వన్డేల్లో చెలరేగిన యాన్సెన్ షార్ట్ ఫార్మాట్‌లో ఆకట్టుకోవడం లేదు. ఇది సఫారీలకు మైనస్‌గా మారింది. బౌలింగ్‌లో ఎంగిడి, అన్రిచ్, బార్ట్‌మన్ ప్రభావం చూపించాల్సిన టైమ్ వచ్చేసింది. స్పిన్నర్‌గా కేశవ్ మహారాజ్‌ను ఆడించొచ్చు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ను పంచుకొని ఈ టూర్‌ను సానుకూలంగా ముగించాలని ప్రొటీస్ టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.
జట్లు (అంచనా)
ఇండియా: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ / సంజూ శాంసన్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా/ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
సౌతాఫ్రికా: మార్‌క్రమ్ (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, కార్బిన్ బాష్, జార్జ్ లిండే / కేశవ్ మహారాజ్ / అన్రిచ్, ఎంగిడి, బార్ట్‌మన్.
పిచ్, వాతావరణం
ఈ మ్యాచ్‌కు పొగ మంచు సమస్య ఉండకపోవచ్చు. అహ్మదాబాద్‌లో చలి ఎక్కువగా లేదు. వెలుతురు కూడా బాగానే ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించొచ్చు.
