రూపాయి పతనం.. ఈ ఏడాదిలో 8.7శాతం డౌన్

రూపాయి పతనం.. ఈ ఏడాదిలో 8.7శాతం డౌన్
  • తగ్గుతూనే ఉన్న రూపాయి విలువ
  •  డాలర్​ పైపైకి
  •  జనానికి తప్పని తిప్పలు

న్యూఢిల్లీ: డాలర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  భారత రూపాయి విలువ  తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది.  దీనివల్ల ప్రభుత్వంతోపాటు జనానికీ ఇబ్బందులు తప్పడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ పెరిగినప్పుడు రూపాయి బలహీనపడుతుంది. గురువారం ట్రేడింగ్‌‌‌‌లో రూపాయి కాస్త కోలుకుని 18 పైసలు పుంజుకుంది.  ఆర్​బీఐ జోక్యం చేసుకోవడంతో రూ.90.20కు మెరుగుపడింది. 

మంగళవారం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. గత ఏడాది అంటే 2024 డిసెంబర్ ఇదే సమయంతో పోలిస్తే రూపాయి విలువ సుమారు రూ.7 నుంచి రూ.8 వరకు క్షీణించింది. గతేడాది ఇదే సమయంలో ఒక డాలర్ విలువ సుమారు రూ.83 ఉండేది. ఇప్పుడు రూ.90.20 కి చేరింది. అంటే సుమారు రూ.7.26 మేర రూపాయి పతనమైంది. ఇది దాదాపు 8.7 శాతం తగ్గుదల.  గతేడాది మీరు విదేశాల నుంచి రూ.83 వేల విలువైన ఒక వస్తువును దిగుమతి చేసుకుంటే, ప్రస్తుతం అదే వస్తువును తెప్పించుకోవడానికి రూ.90 వేలకు పైగా ఖర్చు చేయాలి. అంటే రూ.ఏడు వేల నష్టం. 

ఇవీ కారణాలు:

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాల జాప్యం కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో రూపాయి ఒత్తిడికి లోనవుతోంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడటంతో ఇతర దేశాల కరెన్సీలతో పాటు రూపాయి కూడా బలహీనపడింది. మనం ఎక్కువగా దిగుమతి చేసుకునే ముడి చమురు ధరలు పెరగడం వల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ తగ్గింది. 

దీనివల్ల ప్రజలకు భారం తప్పదు. దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ముడి చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలూ పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు భారమవుతాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌‌‌‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వాడే విడిభాగాలను విదేశాల నుంచి తెచ్చుకుంటాం కాబట్టి వాటి ధరలూ పెరుగుతాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు, విదేశీ ప్రయాణాలు చేసే వారు ఎక్కువ మొత్తం చెల్లించాలి. 

ఈ రంగాలకు లాభం​...

రూపాయి పతనం వల్ల కొన్ని రంగాలకు మేలు జరుగుతుంది.  ముఖ్యంగా ఐటీ సేవలు,  ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలకు ఇది లాభదాయకం. ఆయా కంపెనీలు అందించే సేవలకు ప్రతిఫలంగా డాలర్లు అందుతాయి. డాలర్ విలువ పెరగడం వల్ల ఆ డబ్బును రూపాయల్లోకి మార్చినప్పుడు వారికి ఎక్కువ ఆదాయం వస్తుంది.

 2025 ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ రూ.90 నుంచి రూ.90.60 మధ్య కదలాడవచ్చని అంచనా. అమెరికాలోని ద్రవ్యోల్బణం గణాంకాలు,  నిరుద్యోగిత డేటా ఆధారంగా రానున్న రోజుల్లో రూపాయి గమనం ఆధారపడి ఉంటుంది.  స్టాక్ మార్కెట్లో బీఎస్​ఈ సెన్సెక్స్, నిఫ్టీ కదలికలు కూడా రూపాయి విలువపై ప్రభావం చూపుతాయి.