బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో... పంచాయతీరాజ్ చట్టం–2018ని సవరిస్తూ అసెంబ్లీలో బిల్లు

బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో... పంచాయతీరాజ్ చట్టం–2018ని సవరిస్తూ అసెంబ్లీలో బిల్లు
  • ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా
  • ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు
  • రాష్ట్ర కేబినెట్​కీలక నిర్ణయాలు
  • ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం కొలిచేందుకు పరికరాల ఏర్పాటు
  • పూర్తిస్థాయిలో పంటనష్టం అంచనా వేశాక పరిహారం
  • 2022–23 రబీకి సంబంధించి మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీకి కఠిన చర్యలు
  • గోశాలల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు గ్రీన్​సిగ్నల్
  • కేబినెట్​ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొన్నం, పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: ఎట్టి పరిస్థితుల్లోనూ 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్​ నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీరాజ్​చట్టం-–2018లో రిజర్వేషన్ల పెంపునకు అడ్డుగా ఉన్న సెక్షన్–285ను సవరిస్తూ తెచ్చిన బిల్లును ఆదివారం అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకునేందుకు సిద్ధమైంది. బీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ల అమలుకు వీలుగా రూపొందించిన ఈ సవరణ బిల్లును ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుండగా.. ఉభయ సభల​ ఆమోదం అనంతరం తిరిగి గవర్నర్‌‌కు చేరనుంది. ఈసారి గవర్నర్ తప్పకుండా ఆమోదముద్ర వేస్తారని కేబినెట్​ఆశాభావం వ్యక్తం చేసింది. గవర్నర్​ ఆమోదించినా, పెండింగ్​ పెట్టినా ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలని కేబినెట్​విజ్ఞప్తి చేసింది. 

శనివారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రత్యేకంగా భేటీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, పంచాయతీరాజ్​చట్ట సవరణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటు భారీ వర్షాలు, వరద నష్టంపై చర్చించారు. ప్రధానంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనే చర్చ జరిగింది. ప్రత్యేక జీవో ఇవ్వడమా? లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలుచేయడమా? అనే దానిపై మంత్రులందరి అభిప్రాయాలు తీసుకున్నారు.  

ప్రత్యేక జీవో ఇచ్చేందుకు పంచాయతీరాజ్​చట్టం–2018లోని సెక్షన్​285 అడ్డువస్తుందని, దీనిపై గతంలో తెచ్చిన ఆర్డినెన్స్​రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న విషయం మీటింగ్‌లో ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహా మేరకు చట్ట సవరణ చేసి బిల్లును గవర్నర్‌‌కు పంపాలని కేబినెట్ ​నిర్ణయించింది. కాగా, కేబినెట్‌లో చర్చకు వచ్చిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి, పొన్నం ​ సెక్రటేరియేట్‌లో మీడియాకు వెల్లడించారు.  

బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు: పొన్నం 

హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు ముగించాల్సి ఉన్నందునే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుందని మంత్రులు తెలిపారు.  ‘‘అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని బీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తూ వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్​ తీర్మానం చేసింది’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు అడ్డుగా ఉన్న పంచాయతీరాజ్​చట్టంలోని నిబంధనను సవరిస్తూ రూపొందించిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటామని ఆయన తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం చేసిన కృషిని మంత్రి వివరించారు. బీసీ రిజర్వేషన్లపై కామారెడ్డి డిక్లరేషన్‌తో పాటుకులగణన సర్వే,  బీసీ డెడికేటెడ్​కమిషన్​ఏర్పాటు, సబ్ కమిటీ రివ్యూలు తదితర ప్రక్రియలు చేపట్టామని గుర్తు చేశారు. ‘‘విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మేము పెట్టిన బిల్లులకు బీజేపీ సహా అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ఉభయసభల ఆమోదం అనంతరం వాటిని గవర్నర్‌‌కు  పంపగా..  అటు నుంచి రాష్ట్రపతికి వెళ్లింది. ఇది జరిగి దాదాపు నాలుగు, ఐదు నెలలు గడుస్తోంది’’ అన్నారు. 

ఈ క్రమంలో ఎన్నికల ఆలస్యంపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో న్యాయ కోవిదులతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చల ఆధారంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ‘‘గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన 2018 పంచాయతీరాజ్ చట్టం, 2019 మున్సిపల్ యాక్ట్‌లోని రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్‌ ఎత్తివేయడానికి మా ప్రభుత్వం రెండు నెలల కింద ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు దానిని బిల్లుగా మార్చి ఆదివారం అసెంబ్లీలో పెట్టి చర్చిస్తాం. అందరి మద్దతుతో ఆమోదింపజేసుకుంటాం’’ అని మంత్రి వివరించారు. ఈ నిర్ణయంపై ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, ఎట్టిపరిస్థితుల్లోనూ 42% రిజర్వేషన్లతో పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహిస్తామని పొన్నం స్పష్టం చేశారు. 

నాడు ఎస్టీలకు ఇచ్చినట్టే.. 

ప్రస్తుతం విద్యా, ఉద్యోగాల్లో రాష్ట్రంలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 29%, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి.  రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 64 శాతం అమలవుతున్నాయి. గతంలో ఎస్టీల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి గవర్నర్‌‌కు పంపగా.. దాన్ని రాష్ట్రపతికి పంపారు. అక్కడ ఆమోదం లభించకపోయినా నాటి బీఆర్ఎస్​ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చింది. 

అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16(4) ప్రకారం జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేలా 105వ రాజ్యాంగ సవరణ ద్వారా 342(ఎ) ఆర్టికల్‌లో మార్పు చేశారు. దీంతో రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోకు కేంద్రం ఆమోదం అవసరం లేదు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పెంపు సాధ్యమైందనే వాదన కూడా ఉన్నది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ప్రభుత్వం అలాగే చేయనుంది.

పంటనష్టం అంచనా వేసి పరిహారం చెల్లిస్తం: పొంగులేటి 

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన పంటనష్టంపై పూర్తి స్థాయిలో అంచనా వేసి, రైతులకు పరిహారం చెల్లించాలని కేబినెట్‌లో నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. దీనిపై సోమవారం సాయంత్రం 4 గంటలకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నష్టాన్ని అంచనా వేయడానికి అవసరమైన ఆదేశాలను జారీ చేశారని, దీనిపై పూర్తి నివేదికతో రావాలని కలెక్టర్లు, ఇన్‌చార్జి మంత్రులు, సీఎస్​లకు సూచించినట్లు చెప్పారు. ఈ సమీక్షలో నష్టం అంచనాలను బట్టి తగిన నిధులు మంజూరు చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోశాలల  కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. భారీ వర్షాల సమయంలో నదులు, ప్రాజెక్టులకు వచ్చే వరద ప్రవాహాన్ని కచ్చితంగా కొలిచేందుకు అవసరమైన 'నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్' పరికరాలను ఏర్పాటు చేయడానికి కేబినెట్​ ఆమోదం తెలిపిందని, 2022-23 రబీ సీజన్‌లో మిల్లర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రికవరీ చేసే అంశంపైనా చర్చించినట్లు తెలిపారు. 

టెండర్‌‌లో వచ్చిన బిడ్ రేటు ప్రకారం ధాన్యాన్ని వసూలు చేయాలని, ఒకవేళ మిల్లర్లు సహకరించకపోతే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడానికి సైతం వెనుకాడబోమన్నారు. ఈ వ్యవహారాన్ని కేబినేట్​సబ్​కమిటీకి అప్పగించాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలోని మత్స్య సహ కార సంఘాల ఎన్నికలు ఆలస్యం అవుతున్నందు న, ప్రస్తుతం సంఘంలో సభ్యులుగా ఉన్నవారిని పర్సనల్ ఇన్‌చార్జిలుగా నియమించేందుకు కేబినెట్​ఆమోదం తెలిపిందన్నారు.