
- కౌన్సిల్ సమావేశాలు 5 రోజులు
- 18న రెండు సభల్లో బడ్జెట్
- 20 నుంచి అసెంబ్లీలో క్వశ్చన్, జీరో అవర్స్
- బీఏసీ సమావేశాల్లో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 9 రోజులు, కౌన్సిల్ సమావేశాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిశాక అసెంబ్లీ, కౌన్సిల్ బిజినెస్ అడ్వైజరీ కమిటీల సమావేశాలు వేర్వేరుగా నిర్వహించారు. అసెంబ్లీ బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ మీటింగ్లో సమావేశాల నిర్వహణపై చర్చించారు. గురువారం అసెంబ్లీ, కౌన్సిల్లో 2021–22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 20, 22 తేదీల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్పై సాధారణ చర్చ తర్వాత ప్రభుత్వం సమాధానం చెప్పనుంది. తర్వాత మూడు రోజుల పాటు పద్దులపై చర్చించి ఆమోదం పొందనున్నారు. 26న అప్రాప్రియేషన్ బిల్లు తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడనుంది.
21న బడ్జెట్ పై ప్రశ్నలకు సమాధానం
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతికి మంగళవారం సభలో సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలు గుండా మల్లేశ్, నాయిని నర్సింహారెడ్డి, కమతం రామిరెడ్డి, మధుసూదన్రావు, కట్టా వెంకటనర్సయ్య, దుగ్యాల శ్రీనివాస్రావు, చెంగల్ బాగన్న, కె. వీరారెడ్డి మృతికి సభలో సంతాపం తెలుపుతారు. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. సీఎం కేసీఆర్ సమాధానం తర్వాత సభను తర్వాత రోజుకు వాయిదా వేస్తారు. 18న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. 20వ తేదీ నుంచి అసెంబ్లీలో క్వశ్చన్, జీరో హవర్ నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్పై చర్చ ప్రారంభిస్తారు. ఆ చర్చకు 21న ఆర్థిక మంత్రి సమాధానమిస్తారు. 22 నుంచి 25 వరకు డిపార్ట్మెంట్ల వారీగా పద్దులను సభలో ప్రవేశపెట్టి చర్చిస్తారు. 26న అప్రాప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టి దానికి ఆమోదం తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తారు. బీఏసీ సమావేశంలో మంత్రులు ప్రశాంత్రెడ్డి, హరీశ్రావు, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీ, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రభుత్వ విప్లు, అధికారులు పాల్గొన్నారు.
ఐదు రోజులు కౌన్సిల్
మండలి సమావేశాలు 5 రోజులు నిర్వహించనున్నారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెడతారు. 18న బడ్జెట్ ప్రవేశపెడతారు. 20న బడ్జెట్పై చర్చ. 22న బడ్జెట్పై చర్చకు ప్రభుత్వం సమాధానం చెబుతుంది. 26న అప్రాప్రియేషన్ బిల్లును సభలో ప్రవేశ పెడుతారు. ఆమోదం పొందిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తారు. మండలిలో 20, 22, 26 తేదీల్లో క్వశ్చన్ హవర్, జీరో హవర్ నిర్వహించాలని నిర్ణయించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.