మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి..తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ సంఘాల జేఏసీ

మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి..తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ సంఘాల జేఏసీ

బషీర్ బాగ్, వెలుగు :  రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ పథకాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్ సంఘాల జేఏసీ తెలిపింది. అయితే, ఈ స్కీమ్ ద్వారా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడించింది. వారిని  రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ లోని ఎఐటీయూసీ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నేతలు మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆటో మీటర్ల చార్జీలు పెంచారని గుర్తుచేశారు.

అనంతరం వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తమను అసలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న 7 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని వివరించారు. బస్సుల్లో మహిళల ఫ్రీ జర్నీ ద్వారా  ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.  కర్నాటక మాదిరిగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి

ఆటో డ్రైవర్ల కుటుంబాలకు స్వయం ఉపాధి అందించాలన్నారు. తమ సమస్యపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సమయాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ కన్వీనర్ బి. వెంకటేశం (ఏఐటీయూసీ) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ కో-కన్వీనర్లు వి. కిరణ్ (ఐఎఫ్ టీయూ), బీ. శ్రీకాంత్ (సీఐటీయూ) తదితరులు పాల్గొన్నారు.