బాణసంచాపై నిషేధం.. దుకాణాలు మూసేయాల‌ని సర్కార్ ఆదేశం

బాణసంచాపై నిషేధం..  దుకాణాలు మూసేయాల‌ని సర్కార్ ఆదేశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బాణసంచాపై నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప‌టాకుల దుకాణాలు త‌క్ష‌ణ‌మే మూసివేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ప్రజలు, సంస్థలు బాణసంచా అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఈ మేర‌కు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీ, అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, సీపీల‌కు, రాష్ట్రంలోని పోలీసులకు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం తీసుకున్న చర్యలను నవంబర్ 16వ తేదీలోపు ప్రభుత్వానికి తెలపాలని కోరింది.

రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదౌతున్న నేపథ్యంలో బాణసంచాపై నిషేధం విధించాలని తెలంగాణ హైకోర్టు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో బాణసంచాపై నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని క్రాకర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్ చేస్తోంది. క్రాకర్స్‌ అసోసియేషన్‌ పిటిషన్‌పై శుక్ర‌వారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నది. సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందా అనేదానిపై జనాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రాష్ట్రంలో బాణసంచాను నిషేధించాలని హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులను జారీ చేసింది.

ఇప్పటికే పలువురు వ్యాపారులు దీపావళిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున క్రాకర్స్ విక్రయం కోసం ఏర్పాట్లు చేసుకొన్నారు.ఈ సమయంలో క్రాకర్స్ పై నిషేధం విధించడంతో తాము నష్టపోతామని క్రాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.