
- ప్రయోగాత్మకంగా ఒక చెక్ పోస్టులో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రవాణా శాఖ చెక్ పోస్టుల్లో అవినీతికి చెక్ పెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి ఏఎన్‌పీఆర్ (ఆటో నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఒక చెక్ పోస్టులో దీన్ని అమలు చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టుల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద ఈ కెమెరాలను ఏర్పాటు చేసి అవినీతికి అడ్డుకట్ట వేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడంపై రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టారు.
తెలంగాణలోని పది వరకు ఉన్న రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులతో పాటు మరో 20 వరకు ఉన్న ఇతర ప్రాంతాల్లోని చెక్ పోస్టుల్లో వీటిని ఏర్పాటు చేసే పనిలో రవాణా శాఖ అధికారులు ఉన్నారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయానికి అన్ని చెక్ పోస్టుల్లోని ఏఎన్‌పీఆర్ కెమెరాలను అనుసంధానం చేసి మానిటరింగ్ చేసే ఏర్పాట్లలో అధికారులు ఉన్నారు.
ప్రభుత్వ ఆదాయం పెంపుపై ఫోకస్
ప్రతి రోజు చెక్ పోస్టు గుండా రాష్ట్రంలోకి వస్తున్న, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వాహనాలు ఎన్ని, వాటిలో ఎలాంటి సరకు రవాణా అవుతున్నది, వాటి బిల్స్, పర్మిట్లు.. లాంటివి అన్నీ ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఉన్నాయా, లేదా అనేది ఈ కెమెరాల ద్వారా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో రికార్డు అవుతున్నది. ఒకవేళ ఏ వాహనం అయినా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే ఆన్‌లైన్‌లోనే ఫైన్‌లు వసూలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఇక చెక్ పోస్టుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా పోతుంది. ఇదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తు న్నారు.
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) అంటే ప్రభుత్వ రూల్స్ మేరకే ఈ విధానాన్ని రవాణా శాఖలో అమలు చేయనున్నట్లు ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టుల్లో ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో అక్కడ జరుగుతున్న అవినీతి బట్టబయలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు.