రైతుబంధుపై బీఆర్ఎస్ డ్రామాలు.. నోటిఫికేషన్ ముందే ఎందుకివ్వలేదు : కిషన్ రెడ్డి

రైతుబంధుపై బీఆర్ఎస్ డ్రామాలు.. నోటిఫికేషన్ ముందే ఎందుకివ్వలేదు : కిషన్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుండగా.. పార్టీ అధినేతలు తమ తమ వాయిస్ ను రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటే అని ఎవరైనా అంటే.. అలాంటోళ్లను చెప్పులతో కొట్టండి అంటూ ఘాటుగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ కలిసేది లేదని.. అలాంటి ఆలోచన లేదని వివరించారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు ఒక్కటే అంటూ కాంగ్రెస్ పార్టీ పదేపదే విమర్శలు చేయటమే కాకుండా.. అందుకు తగ్గ ఆధారాలు ఇవే అంటూ చెప్పుకొస్తుంది. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. 

బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ పేరు మార్పు ఖాయమని స్పష్టం చేశారాయన. ఎవడీ హైదర్.. ఎందుకిలా హైదరాబాద్ పేరు అని ప్రశ్నించారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని హామీ ఇచ్చిన ఆయన.. బాంబేను ముంబైగా మార్చినట్లు.. మద్రాస్ ను చెన్నైగా మార్చినట్లు.. కలకత్తాను కోల్ కతాగా మార్చినట్లు.. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చనున్నట్లు వెల్లడించారాయన.

రైతు బంధు నిలిపివేస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంపైనా స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని.. రైతులపై ప్రేమ ఉంటే.. రైతుబంధు ఇవ్వాలి అనుకున్నప్పుడు.. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఇవ్వొచ్చు కదా.. 15 రోజుల ముందు రైతులకు ఇచ్చి ఉంటే ఏమయ్యేదని ప్రశ్నించారాయన. రైతుబంధు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని.. రైతులపై చిత్తశుద్ధి లేదన్నారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలోనూ.. రైతుబంధు డ్రామాలు ఆడారని.. ఎన్జీవోలతో కంప్లయింట్స్ చేయించుకున్నారంటూ గతాన్ని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. నేరుగా గెలిచే సత్తా లేకుండా.. రైతులు, ప్రజలను మభ్యపెడుతూ ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నాయంటూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు కిషన్ రెడ్డి.