ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు: లక్ష్మణ్

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు: లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు:  టీఆర్ఎస్ సర్కార్ పై రాష్ట్ర ప్రజలకు ఓపిక నశిస్తోందని, వారు తిరగబడితే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. తాము మాత్రం 2023 వరకు ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని, ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తోందని తెలిపారు. టీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు లెఫ్ట్, రైట్ అనే తేడా లేకుండా అన్ని పార్టీల వారు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని చాటుకుంటుందని, విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికల్లో డబ్బుతో గెలుస్తామనే ధీమాలో ఉందని విమర్శించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కోర్ కమిటీ సభ్యులు మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనా రెడ్డి, గరికపాటి మోహన్ రావు,పెద్దిరెడ్డి, పేరాల శేఖర్ రావు, పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. కోర్ కమిటీలో ప్రధానంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక, అభ్యర్థి ఎంపికతో పాటు త్వరలో జరుగనున్న మున్సిపల్​ ఎన్నికలపై చర్చించారు. సమావేశం అనంతరం లక్ష్మణ్ మీడియాతో చిట్ చాట్​లో మాట్లాడారు. హుజూర్ నగర్ బరిలో నిలిచేందుకు బీజేపీకి 8 మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. వీరిలో శ్రీకళారెడ్డి, రామారావు, రామకృష్ణ, రాంమోహన్ రావు, రవీంద్ర నాయక్, జైపాల్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు ఉన్నారని చెప్పారు. బలమైన అభ్యర్థి ఎవరనే దానిపై కోర్  కమిటీలో చర్చించామని, ఇందులో మూడు నుంచి నాలుగు పేర్లు  పార్టీ హైకమాండ్ కు పంపిస్తామని, హైకమాండ్​ సూచించే పేరును తాము ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. రెండు రోజుల్లో అభ్యర్థి ఎంపిక పూర్తవుతుందన్నారు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడానికి తమదేమి కుటుంబ పార్టీ కాదని, డైనింగ్ టేబుల్ నిర్ణయాలు తాము తీసుకోలేమని వ్యాఖ్యానించారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పార్టీలో చేరే విషయంపై గానీ, టికెట్ కు సంబంధించి గానీ ఇప్పటివరకు తమను సంప్రదించలేదని, బీజేపీ కూడా ఆమెతో మాట్లాడలేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నిక ప్రచారంలో జాతీయస్థాయి నేతలు ఎవరు పాల్గొనబోరని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ కు పోటీగా ఇక్కడి తమ నాయకులు సరిపోతారని తెలిపారు.

తండ్రీకొడుకులకు బీజేపీ అంటే భయం

అడ్డదారిలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ నేతలు.. తమ పార్టీ  లోక్​సభ ఎన్నికల గెలుపును అడ్డిమార్ గుడ్డి దెబ్బ అంటారా అని లక్ష్మణ్  మండిపడ్డారు.  ఉద్యమకారులను పక్కన పెట్టి, ఉద్యమంపై రాళ్లు వేసిన వారిని పదవిలో కూర్చోబెట్టిందే టీఆర్​ఎస్​ అని దుయ్యబట్టారు. తండ్రీకొడుకులు కేసీఆర్​, కేటీఆర్​ బీజేపీ అంటేనే భయపడిపోతున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులను ఇన్ని సంఘాలు ఎందుకని ప్రశ్నిస్తున్న సీఎం.. మరి ఆయన  కుటుంబంలో అంత మందికి పదవులు ఎందుకని లక్ష్మణ్​ ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్  గంటల తరబడి కూర్చుండి మాట్లాడిందేముంటుందని, కేంద్రాన్ని విమర్శించడం తప్ప అని ఎద్దేవా చేశారు.

మజ్లిస్​ కోసమే మున్సిపల్​ చట్టంలో మార్పు

మున్సిపాలిటీల్లో తమ పార్టీ పోరుబాట కొనసాగుతుందని, ఎన్నికల తేదీ ఖరారు తర్వాత మరింత దూకుడును పెంచుతామని లక్ష్మణ్​ అన్నారు. పంచాయతీరాజ్ లో తీసుకురాని ఇద్దరు పిల్లల మార్పు చట్టాన్ని, మున్సిపాలిటీలో ఎందుకు తీసుకువచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది కేవలం మజ్లిస్ పార్టీ కోసమేనని ఆయన విమర్శించారు. దీనిపై త్వరలోనే గవర్నర్ ను  కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.

షకీల్​ వంటివారేకాదు.. ఇంకా ఎందరో

బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ వంటి వారే కాదు ఇంకా ఎందరో చేరుతారని, ఇప్పుడు ట్రైలర్ మాత్రమే చూస్తున్నారని, మున్ముందు రంగుల సినిమా చూస్తారని లక్ష్మణ్​ అన్నారు. టీఆర్ఎస్ లో ఓనర్లు, కిరాయిదార్ల గొడవలు కొనసాగుతున్నాయని, తమ పార్టీలో చేరికలు అనేది నిరంతరం సాగే ప్రక్రియ అని తెలిపారు.

శ్రీకళారెడ్డి వైపే మొగ్గు?

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో శ్రీకళారెడ్డిని నిలిపేందుకే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవలే బీజేపీలో చేరిన ఆమె గతంలో టీడీపీలో పనిచేశారు. శ్రీకళారెడ్డి తండ్రి జితేందర్ రెడ్డి గతంలో కోదాడ ఎమ్మెల్యేగా చేశారు. ఆమె భర్త బీఎస్పీ తరఫున యూపీ నుంచి 2009లో  ఎంపీగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బలమైన అభ్యర్థి శ్రీకళారెడ్డినేనని బీజేపీ భావిస్తోందని, ఆమెకే టికెట్ దక్కే చాన్స్ ఉందని పార్టీ సీనియర్ ఒకరు వ్యాఖ్యానించారు. అయితే మరో ఇద్దరి పేర్లనూ పార్టీ సీరియస్ గానే పరిశీలిస్తుందని బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆ ఇద్దరిలో గతంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు సన్నిహితంగా ఉన్న మహిపాల్ రెడ్డి ఒకరని, మరొకరు వెంకటరెడ్డి అని ఆ వర్గాలు అంటున్నాయి. ఆశావహుల జాబితాను పార్టీ హైకమాండ్​కు రాష్ట్ర నేతలు పంపారు. అభ్యర్థి ఎవరనేది రెండురోజుల్లో హైకమాండ్​ తేల్చనుంది.