బీజేపీ బహిరంగసభ.. విశేషాలు

బీజేపీ బహిరంగసభ..  విశేషాలు

హైదరాబాద్ లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న సభకు ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు, వివిధ రాష్ట్రాల నేతలు హాజరుకానున్నారు. ఇక మోడీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం. ఈ సభలో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. తెలంగాణ రాష్ట్రంపై ఓ కీలక ప్రకటన వెలువడుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక పరేడ్ గ్రౌండ్  చుట్టు పక్కల ప్రాంతాలన్నీ కటౌట్లు, జెండాలు, భారీ హోర్డింగులతో కాషాయమయైంది. సభా ప్రాంగణంలో 4 వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై పీఎం మోడీ, పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ , గడ్కరీ, కిషన్ రెడ్డి, రాష్ట్ర నేతలు సంజయ్ , లక్ష్మణ్, డీకే అరుణ కూర్చోనున్నారు.

సభకు 10 లక్షల మంది :-
రెండో వేదికపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఉండనున్నారు. ఇక మూడో వేదికపై పార్టీ జాతీయ నాయకులు ఉంటారు. సాంస్కృతిక ప్రదర్శనల కోసం నాలుగో వేదిక ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా తడవకుండా వేదికలు, సభ ప్రాంగణంలో జర్మన్ హ్యాంగర్స్ వేయించారు. సుమారు 2 లక్షల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ, సభకు 10 లక్షల మంది వస్తారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీల మధ్యలో, ఖాళీ ప్రదేశం వదిలేశారు. సభకు వచ్చే మిగతావారంతా ఈ ఖాళీ ప్రదేశాల్లో కూర్చొని చూసేలా కింద కార్పెట్లు వేశారు. సభా ప్రాంగణం బయట ఉన్నవారు కూడా కార్యక్రమాలను చూసేందుకు భారీ LEDలను ఏర్పాటు చేశారు. నేతల ప్రసంగాలు 2 కిలోమీటర్ల దూరం వరకు వినిపించేలా స్పీకర్లు పెట్టారు.