Telangana Budget 2024: ఇరిగేషన్​కు రూ.28 వేల కోట్లు

Telangana Budget 2024: ఇరిగేషన్​కు రూ.28 వేల కోట్లు
  •     ప్రాజెక్టుల​ అప్పుల.. కిస్తీలు, మిత్తీలకే  రూ.17 వేల కోట్లకు పైగా
  •     ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకే కేటాయింపులు
  •     పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ కు రూ.2,050 కోట్లు!
  •     ఏఎమ్మార్ ఎస్ఎల్​బీసీకి రూ.2533 కోట్లు!

హైదరాబాద్, వెలుగు: బడ్జెట్​లో ఇరిగేషన్​శాఖకు రూ.28 వేల కోట్లు కేటాయించారు. నిరుటితో పోలిస్తే ఓటాన్ అకౌంట్ బడ్జెట్​లో రూ.2 వేల కోట్లు పెంచారు. ఇందులో కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల కోసం తెచ్చిన అప్పులు, వాటి వడ్డీల చెల్లింపులకు రూ.17 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకే బడ్జెట్​లో కేటాయింపులు చేస్తున్నామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రాణహిత ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించబోతున్నారు. నారాయణపేట్– కొడంగల్​లిఫ్ట్​స్కీంను చేపట్టడానికి నిధులు ఇచ్చారు. జులై వరకు ప్రభుత్వ నిర్వహణకు ఓటాన్​ఎకౌంట్​బడ్జెట్​లో నిధులు కేటాయించారు. కేంద్ర బడ్జెట్ తర్వాత ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్​లోనే ప్రాజెక్టుల వారీగా నిధుల కేటాయింపులపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ బడ్జెట్​లో పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్​ స్కీంతో పాటు 75 శాతం, అంతకన్నా ఎక్కువ శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులకు మాత్రమే కేటాయింపులు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పూర్తి చేస్తామని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎమ్మార్​ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్​ స్కీములు, ఎస్సారెస్పీ వరద కాలువ, దేవాదుల ఎత్తిపోతల పథకం, కుమ్రం భీమ్ ప్రాజెక్టు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు రానున్న రెండేండ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత లోపాలు, అనాలోచిత డిజైన్లపై సమగ్ర విచారణకు ఇప్పటికే ఆదేశించామని చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఏ ప్రాజెక్టుకు ఎంతంటే.. 

2024 –25 బడ్జెట్​లో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కనీసం రూ.2,050 కోట్లు ఖర్చు చేస్తే కొత్తగా 2.80 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశముందని ఇంజినీర్లు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.27,553  కోట్లు ఖర్చు చేశారని, తాము కోరిన మొత్తాన్ని మంజూరు చేస్తే ఆయకట్టుకు నీళ్లిచ్చే ఆస్కారముందని ఇంజినీర్లు కోరగా అందుకు ఆర్థిక శాఖ ఓకే చెప్పింది. ఏఎమ్మార్​ఎస్​ఎల్బీసీ పనులు పూర్తి చేయడానికి రూ.4,915 కోట్లు అవసరం కాగా ఈ బడ్జెట్​లో రూ.2,533 కోట్లు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టును రానున్న మూడేళ్లలో పూర్తి చేసి ఇంకో 1.26 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రతిపాదించారు. ఎల్లంపల్లి లిఫ్ట్​స్కీంకు రూ.590 కోట్లు, దేవాదుల ఎత్తిపోతలకు రూ.1,904 కోట్లు, కోయిల్​సాగర్​కు రూ.214 కోట్లు, ఎస్సారెస్పీ వరద కాలువ రూ.891 కోట్లు, భీమా ఎత్తిపోతలకు రూ.194 కోట్లు, నెట్టెంపాడుకు రూ.293 కోట్లు, ఎస్సారెస్పీ స్టేజీ –2కు రూ.67 కోట్లు, కుమ్రం భీమ్ ప్రాజెక్టుకు రూ.64 కోట్లు, కల్వకుర్తి లిఫ్ట్​స్కీంకు రూ.715 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.283 కోట్లు ఇవ్వాలని ఆయా ప్రాజెక్టుల ఇంజినీర్లు కోరారు. పూర్తి స్థాయి బడ్జెట్ లో వీటికి కోరిన మేరకు కేటాయింపులు ఉంటాయని ఫైనాన్స్​శాఖ నుంచి గ్రీన్​సిగ్నల్​ఇచ్చినట్టుగా తెలుస్తున్నది.