హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ, పాత అప్పులను, వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టినట్టు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే, ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని, అందుకోసమే అహర్నిశలు శ్రమిస్తున్నట్టు తెలిపారు. ఎంచుకున్న లక్ష్యాలవైపు అడుగులు వేయడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, లెక్క చేయక ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా.. తెలంగాణ ప్రజానీకం పట్ల, వారి అభ్యున్నతి పట్ల అత్యున్నతమైన చిత్తశుద్ధితో ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్టు వివరించారు. శుక్రవారం శాసన సభలో 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. దాదాపు 2 గంటలపాటు ఆయన బడ్జెట్ ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,24,234 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా ప్రతిపాదించారు. అనేక సవాళ్లు, ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొన్నప్పటికీ.. తెలంగాణ “బూడిదలో నుంచి ఫీనిక్స్ పక్షి మళ్లీ లేచినట్టు” అభివృద్ధి దిశగా వడివడిగా ముందుకు సాగుతున్నదని అన్నారు.
ఈ బడ్జెట్‌లో రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, తెలంగాణను సుస్థిరమైన అభివృద్ధి వైపునకు నడిపించేదిగా రూపొందించామన్నారు. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతీ, సంప్రదాయాలకు, పండుగలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు.
దేశం తగ్గింది.. రాష్ట్రం పెరిగింది
2025-–26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ ప్రస్తుత ధరల ప్రకారం రూ.17.82 లక్షల కోట్లు కాగా.. నిరుడితో పోలిస్తే వృద్ధిరేటు 10.7 శాతంగా నమోదైందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇదే సమయంలో, దేశజీడీపీ వృద్ధి రేటు 8 శాతంగా ఉందన్నారు. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉందని తెలిపారు. ఒకవైపు దేశవృద్ధి రేటు పడిపోతే.. ఇదే సమయంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిరేటు 2024-–25లో 10.6 శాతం నుంచి 2025-–26 నాటికి 10.7 శాతానికి పెరిగిందని వివరించారు.
కో -ఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితో..
గత ప్రభుత్వం 2014 –2023 వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సరైన రీతిలో వినియోగించలేదని, కేంద్రం నుంచి మంజూరైన నిధులను కూడా ఆయా పథకాల అమలుకు ఖర్చు చేయకుండా, ఇతర అవసరాలకు దారి మళ్లించిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన తదుపరి వాయిదాలు నిలిచిపోయి, రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందని చెప్పారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితిని వెంటనే గుర్తించి 2014-–15 నుంచి 2023-–24 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద బకాయి పడ్డ నిధులన్నింటినీ సంబంధిత శాఖలకు సుమారు రూ.3 వేల కోట్లు రిలీజ్ చేసినట్టు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కో-ఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి దాకా రూ.7 వేల 72 కోట్లను సాధించినట్టు తెలిపారు. గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన దాదాపు రూ.27,988 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకున్నామని, దీంతో రాష్ట్రానికి రూ.22 వేల 142 కోట్ల క్యాష్ అవుట్ ఫ్లో తగ్గి నగదు వెసులుబాటు కలిగిందని వివరించారు.
ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్
దేశంలో ఎక్కడాలేని విధంగా కేవలం అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే లభించే ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ను రాష్ట్రంలోని ప్రజలందరికీ అమలుపరుస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య రక్షణ అత్యంత ముఖ్యమని అన్నారు. అందుకోసం ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసి, వారికి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు. వీటి నిర్వహణలో అత్యంత గోప్యతను పాటిస్తామని వెల్లడించారు. పన్నుల భారంతో సామాన్యుడి పైన భారం మోపకుండా.. ఉన్న వనరులను సద్వినియోగం చేస్తూ, కొత్త సంపదను సృష్టించి దానిని ప్రజలకు పంచడమే ప్రజా ప్రభుత్వ ఆర్థిక విధానమని స్పష్టం చేశారు. పేదవాడి కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. పదేండ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది ఈ బడ్జెట్అని పేర్కొన్నారు.
