అడవులు, పర్యావరణానికి రూ.1,049 కోట్లు

అడవులు, పర్యావరణానికి రూ.1,049 కోట్లు
  • గతేడాది కంటే రూ.26 కోట్లు ఎక్కువ కేటాయింపు
  • అటవీ, పర్యావరణ శాఖలో స్కీంల కోసం రూ.174.49 కోట్లు 
  • వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల సివిల్ పనులకు రూ.70 కోట్లు
  • నెహ్రూ జూ పార్కుకు రూ.18 కోట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పచ్చదనం పెంచడంతోపాటు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి  2026–-27 బడ్జెట్‌లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలకు కలిపి మొత్తం రూ.1,049 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.1,023 కోట్లతో పోలిస్తే రూ.26 కోట్లు అదనంగా పెట్టింది.

ఇందులో స్కీంల కోసం రూ.174.49 కోట్లు ఖర్చు చేయనుంది. అభయారణ్యాలు, రక్షిత ప్రాంతాల్లో సివిల్ పనుల కోసం రూ.70 కోట్లు కేటాయించింది. వన్యప్రాణుల ఆవాసాలను మెరుగుపరచడం, అక్కడ అవసరమైన నిర్మాణాలను చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులోని జంతువుల ఆహారం, రేషన్ కోసం రూ.18 కోట్లు పెట్టారు. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ మౌలిక సదుపాయాల కోసం రూ.15 కోట్లు, ఇతర కొనుగోళ్లు, నిర్వహణ కోసం మరో రూ.7.41 కోట్లు కలిపి మొత్తం రూ. 22.41 కోట్లు కేటాయించారు.

విద్యార్థుల స్టైఫండ్ కోసం ఇందులోని నిధులను వినియోగించనున్నారు. ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఇతర వన్యప్రాణుల రక్షణ పథకాల కోసం(ఎస్ఎన్ఏ– స్పర్శ కింద) రూ.33.25 కోట్లు ప్రతిపాదించారు. పులుల సంరక్షణకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వేసవిలో అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు రూ.8 కోట్లు కేటాయించారు. 

పర్యావరణం, టెక్నాలజీకి రూ.8.10 కోట్లు

రాష్ట్రంలో పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ప్రభుత్వం బడ్జెట్​లో రూ.8.10 కోట్లు పెట్టింది. ఇందులో ప్రధానంగా శాస్త్రీయ పరిశోధనలకు రూ.4.05 కోట్లు, పర్యావరణ పరిరక్షణ శిక్షణ(ఈపీటీఆర్ఐ) కోసం రూ.60 లక్షలు వినియోగించనున్నారు. ప్రకృతిని కాపాడేందుకు, జీవవైవిధ్యాన్ని రక్షించేందుకు ప్రభుత్వం నిధుల తోడ్పాటునందించింది. తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డుకు రూ.3 కోట్లు, నేషనల్ గ్రీన్ కోర్ కు రూ.39 లక్షలు కేటాయించారు. శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనల కోసం రూ.3.75 కోట్లు, వరంగల్‌లోని ప్రాంతీయ సైన్స్ సెంటర్ నిర్వహణ కోసం రూ.30 లక్షలు పెట్టారు.