ఏటీసీల్లో స్కాలర్‌ ‌‌‌షిప్స్ఒక్కో అభ్యర్థికి ప్రతినెలా..రూ.2 వేలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం

 ఏటీసీల్లో స్కాలర్‌ ‌‌‌షిప్స్ఒక్కో అభ్యర్థికి ప్రతినెలా..రూ.2 వేలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ఏటీసీల్లో వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ యువతకు నెలకు రూ.2 వేలు చొప్పున స్టైపెండ్ ఇస్తామని బడ్జెట్‌‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఏటీసీలను బలోపేతం చేయడం, ఎక్కువ మంది నిరుద్యోగులు అందులో చేరేలా ప్రొత్సహించేందుకు స్కాలర్‌‌‌‌షిప్ ఇస్తామని గతేడాది సెప్టెంబర్ 27న ఏటీసీలప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ప్రస్తుతం అన్ని ఏటీసీల్లో కలిపి 34 వేల మంది నిరుద్యోగ యువత వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో 65 నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఏటీసీలు ప్రారంభం కాగా, మరికొన్నింటి నిర్మాణం చివరి దశలో ఉంది. వీటిలో రికార్డ్ స్థాయిలో తొలిసారి 98 శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయి. రెండో దశలో ప్రభుత్వం 53 నియోజకవర్గాలకు ఏటీసీలను మంజూరు చేసింది. వీటికి భూ సేకరణతో పాటు నిర్మాణ పనులకు సీఎం, మంత్రులు శంకుస్థాపనలు చేశారు. వీటి నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. 

కొత్తగా సీఎం ఓవర్సీస్‌‌ స్కీమ్.. 

కార్మిక శాఖలో ప్రభుత్వం కొత్త స్కీమ్‌‌ను లాంచ్‌‌ చేసింది. రాష్ట్ర నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం ఓవర్సీస్‌‌ ఎంప్లాయ్‌‌మెంట్ పోగ్రాం (సీఎంవోఈపీ)ను ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్‌‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న స్కిల్డ్ యూత్‌‌ను ఎంపిక చేసి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే టామ్ కామ్ ద్వారా విదేశాల్లో తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉన్నత ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్‌‌మెంట్, విదేశీ భాషలు నేర్పించడంతో పాటు పారదర్శకంగా నియామకాలు చేపడ్తున్నారు. రాష్ట్రంలో వివిధ నైపుణ్యాలు ఉన్న యువత లక్షల్లో ఉన్నప్పటికీ విదేశీ భాషలు తెలియకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, సరైన శిక్షణ లేకపోవడం, వీసా సమస్యలతో విదేశాలకు వెళ్లలేకపోతున్నారు. సీఎం ఓవర్సీస్‌‌ పోగ్రాంలో ఈ సమస్యలను పరిష్కరించి విదేశాల్లో ఎక్కువ మంది తెలంగాణ నిరుద్యోగులు జాబ్‌‌లు పొందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ శ్రీకారం చుట్టింది.