Telangana Budget: బడ్జెట్ లో సంక్షేమానికి టాప్​ ప్రయారిటీ

Telangana Budget:  బడ్జెట్ లో సంక్షేమానికి టాప్​ ప్రయారిటీ
  • రూ.45,449 కోట్లు ప్రతిపాదించిన సర్కారు

హైదరాబాద్, వెలుగు: బడ్జెట్​లో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఆరు గ్యారంటీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం కోసం ప్రాధాన్యతా పరంగా బడ్జెట్ లో నిధులను కేటాయించింది. ఓటాన్​అకౌంట్​బడ్జెట్​కు అనుగుణంగా నిధులను ప్రతిపాదించింది. దాంతోపాటు గురుకులాల కోసమూ నిధులను పెంచింది. బీసీ సంక్షేమానికి గత బడ్జెట్ కన్నా ఎక్కువ నిధులు కేటాయించింది. వాస్తవిక అంచనాలకు అనుగుణంగా సంక్షేమానికి బడ్జెట్​ కేటాయించామని సభలో భట్టి విక్రమార్క చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి మొత్తంగా రూ.45,449 కోట్లను కేటాయించింది. ఎస్సీ సంక్షేమానికి రూ.21,874 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ.13,313 కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.8,000 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.2,262 కోట్లను ప్రతిపాదించింది. బీసీలకు గత బడ్జెట్ తో పోలిస్తే ప్రస్తుతం రూ.1770.8 కోట్లను అధికంగా కేటాయించింది.

గురుకులాలకు దండిగా..

పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పూనుకున్నది. అందుకు అనుగుణంగా బడ్జెట్​లో నిధులను కేటాయించింది. చాలా గురుకులాలకు సొంత భవనాల్లేక అద్దె భవనాల్లో నడుస్తుండగా.. ఆ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం గురుకులాలకు కొత్త బిల్డింగుల కోసం నిధుల కేటాయింపులో పెద్దపీట వేసింది. అందుకు అనుగుణంగా బీసీ గురుకులాల కోసం రూ.1546 కోట్లను ప్రభుత్వం బడ్జెట్​లో కేటాయించింది. ఎస్సీ గురుకులాలకు రూ.వెయ్యి కోట్లు, ఎస్టీ గురుకులాలకు రూ.250 కోట్లను ప్రతిపాదించింది. గురుకుల స్కూళ్లలో బోధనా సిబ్బంది నియామకాల భర్తీని చేపట్టబోతున్నామని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గురుకుల స్కూళ్లలో సౌర విద్యుత్​ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాడుకోగా మిగిలిన విద్యుత్​ను అవసరమైన చోట గురుకులాలకు సరఫరా చేస్తామన్నారు. అంతేగాకుండా గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కాలేజీల ఏర్పాటు ప్రక్రియనూ ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆలిండియా కౌన్సిల్​ఫర్​టెక్నికల్​ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)కి ప్రతిపాదనలను పంపించినట్టు భట్టి విక్రమార్క చెప్పారు.  

ఫూలే యోజన నుంచి అదనపు నిధులు

కేంద్రం అమలు చేస్తున్న సావిత్రీబాయి ఫూలే అభ్యుదయ యోజన నుంచి అదనపు నిధులను సాధించి రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేస్తామంటూ భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్​షిప్​లను క్రమం తప్పకుండా అందిస్తామన్నారు. విదేశీ విద్యా పథకం కింద ఎక్కువమందికి చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. తద్వారా విద్యార్థులు బెంగ పెట్టుకోకుండా చదువుకునేలా సాయపడతామన్నారు. సంప్రదాయ వృత్తుల్లో ఉన్న వారికి కొత్త టెక్నాలజీలో శిక్షణనిచ్చి అవసరమైన పనిముట్లు అందజేస్తామన్నారు. వారి పిల్లలు ఐఐటీ, ఇంటర్నేషనల్​యూనివర్సిటీల్లో సీట్లు సాధించేలా నైపుణ్య శిక్షణను అందిస్తామని పేర్కొన్నారు. విదేశీ ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేటట్టు వారిని తయారు చేస్తామని తెలిపారు.