స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ :  చదువులకు పెద్ద పీట.. బడ్జెట్లో భారీగా నిథులు కేటాయింపు.. విద్యారంగానికి  రూ. 26,674 కోట్లు 

స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ :  చదువులకు పెద్ద పీట.. బడ్జెట్లో భారీగా నిథులు కేటాయింపు..  విద్యారంగానికి  రూ. 26,674 కోట్లు 
  • గతేడాది కంటే 0.64 శాతం పెంపు  
  • స్కూల్ ఎడ్యుకేషన్​ నిర్వహణ పద్దు16,458.08
  • ప్రగతి పద్దు4,415.20

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో విద్యారంగానికి ప్రాధాన్యతనిచ్చింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ. 26,674 కోట్లను విద్యాశాఖ కోసం ప్రతిపాదించింది. గత ఏడాదితో పోలిస్తే కేటాయింపుల్లో 0.64 శాతం పెరుగుదల కనిపించింది. అయితే, ఈసారి నిర్వహణ పద్దు కంటే అభివృద్ధి పనులకు కేటాయించే ప్రగతి పద్దుపై సర్కారు ఎక్కువ ఫోకస్ పెట్టింది.

ప్రధానంగా స్కూల్ ఎడ్యుకేషన్‌‌‌‌లో ప్రగతి పద్దు కింద గతేడాది రూ.379 కోట్లు కేటాయించగా, ఈసారి దాన్ని ఏకంగా రూ. 1,367 కోట్లకు పెంచింది. అలాగే సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కు ఈ బడ్జెట్‌‌‌‌లో రూ. 505.40 కోట్లు కేటాయించింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల కోసం రూ.500 కోట్ల నిధులను ప్రతిపాదించారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టుకు గతేడాది రూ. 1,952.17 కోట్లు ఇవ్వగా, ఈసారి ఆ మొత్తాన్ని రూ. 2,404 కోట్లకు పెంచారు. ఇందులో నుంచి మిడ్ డే మీల్స్ తో పాటు స్కూళ్లలో వసతులకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.  

కొన్నింట కోత.. మరికొన్నింట పెంపు 

ప్రగతి పద్దు కింద అడల్ట్ఎడ్యుకేషన్ కు గతేడాది రూ.15.67 కోట్లు ప్రతిపాదించగా.. ఈ సారి రూ. 19.30 కోట్లకు పెంచారు. పరీక్షల విభాగానికి రూ. 7.50 కోట్లు కేటాయించారు. అయితే, లైబ్రరీలు, టెక్స్ట్ బుక్స్ విభాగాలకు నిధుల్లో కోత పెట్టారు. లైబ్రరీలకు గతేడాది కంటే రూ.10 కోట్లు తగ్గించి కేవలం రూ. 4.75 కోట్లే కేటాయించారు. టెక్స్ట్ బుక్స్ విభాగానికి గతేడాది రూ. 18.29 కోట్లు ఉండగా, ఈసారి దాన్ని రూ. 5.49 కోట్లకు పరిమితం చేశారు. సొసైటీ గురుకులాలకు సైతం నిధులు స్వల్పంగా తగ్గాయి. గతేడాది రూ. 670.24 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 610.82 కోట్లు ప్రతిపాదించారు. 

ఇంటర్ లో బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మీల్స్ 

సర్కారు జూనియర్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు బ్రేక్​ఫాస్ట్​తో పాటు మధ్యాహ్నం భోజనం అందించాలని సర్కారు నిర్ణయించింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అభివృద్ధి కోసం కేటాయించే ప్రగతి పద్దులో నిధులు కేటాయించారు. గతేడాది ఈ పద్దు కింద కేవలం రూ.6.47 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది ఏకంగా రూ.135.88 కోట్లను ప్రతిపాదించారు.

విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రేక్ ఫాస్ట్, పాలు అందించడానికి రూ. 56 కోట్లు, మిడ్ డే మీల్స్ కోసం రూ.70 కోట్లను బడ్జెట్‌‌‌‌లో ప్రతిపాదించారు. దీంతోపాటు ప్రత్యేక అవసరాలు కలిగిన (సీడబ్ల్యూఎస్ఎన్) విద్యార్థులు కాలేజీలకు వచ్చేందుకు వాహనాల కోసం రూ. 5 కోట్లు ప్రతిపాదించారు. ఇతర కనీస మౌలిక వసతుల కల్పన కోసం రూ. 4.20 కోట్లను కేటాయించారు. 

  • హయ్యర్ ఎడ్యుకేషన్
  • నిర్వహణ పద్దు 2,724.11
  • ప్రగతి పద్దు 1,925.93

టెక్నికల్ ఎడ్యుకేషన్

 

  • నిర్వహణ పద్దు 538.99
  • ప్రగతి పద్దు 146.40