హెల్త్‌‌కు బూస్ట్.. ప్రజల ఆరోగ్యంకోసం  రికార్డ్ స్థాయిలో నిధులు కేటాయింపు

హెల్త్‌‌కు బూస్ట్.. ప్రజల ఆరోగ్యంకోసం  రికార్డ్ స్థాయిలో నిధులు కేటాయింపు
  • బడ్జెట్​లో రూ.13,679 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
  • రాష్ట్ర చరిత్రలోనే మెడికల్ అండ్ హెల్త్ కు అత్యధిక కేటాయింపులు
  • గతేడాది కంటే రూ.1,286 కోట్లు అదనం.. 9.40 శాతం పెంపు
  • డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్​కే ఏకంగా రూ.6,681 కోట్లు
  • ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి రూ.100 కోట్లు 
  • మందుల కొనుగోలుకు రూ.377 కోట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగానికి ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్య శాఖకు ఎకంగా రూ.13,679 కోట్లు కేటాయించి ప్రాధాన్యతను చాటుకుంది.

గతేడాది కేటాయించిన రూ.12,393 కోట్లతో పోలిస్తే.. ఈ సారి రూ.1,286 కోట్లు (9.40 శాతం) అదనంగా నిధులు పెరగడం విశేషం. బడ్జెట్ ప్రతిపాదనల్లో నిర్వహణ వ్యయం కింద రూ.6,984 కోట్లు, ప్రగతి పద్దు కోసం రూ.6,695 కోట్లు చూపించారు. మొత్తం బడ్జెట్‌‌‌‌‌‌‌‌ లో వైద్య రంగానికి 4.22 శాతం వాటా దక్కింది.

ఆరోగ్య శ్రీకి గతంలో మాదిరిగానే..

రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కు గతంలో మాదిరిగానే రూ.1,143 కోట్లు కేటాయించారు. అయితే, చికిత్స లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం, ప్యాకేజీ రేట్లు 20 నుంచి -25 శాతం పెరగడంతో ఈ నిధులు ఎంతవరకు సరిపోతాయనే చర్చ మొదలైంది. ప్రైవేటు  హాస్పిటల్స్ కు చెల్లించాల్సిన బకాయిలు కూడా పెండింగ్‌‌‌‌‌‌‌‌ లో ఉండటంతో ఆరోగ్యశ్రీకి మరిన్ని నిధులు అవసరమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

సగం నిధులు డీఎంఈకే.. 

రాష్ట్రంలోని మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణం, టీచింగ్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ ను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే మొత్తం హెల్త్ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ లో దాదాపు 48.77 శాతం నిధులను  డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కే కేటాయించింది.

డీఎంఈ పరిధిలోని కాలేజీలు, హాస్పిటల్స్ కోసం రూ.6,681 కోట్లు కేటాయించారు. ఇందులో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.381 కోట్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు రూ.252 కోట్లు వెచ్చించనున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త కాంప్లెక్స్ నిర్మాణానికి తొలి విడతగా రూ.100 కోట్లు కేటాయించారు. అలాగే, నర్సింగ్ కాలేజీల కోసం మరో రూ.140 కోట్లు కేటాయించారు. 

సెకండరీ కేర్​గా టీవీవీపీ..

ఇప్పటిదాకా గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థగా ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ని ప్రభుత్వం సెకండరీ హెల్త్ కేర్ విభాగంలోకి మార్చింది. దీని పరిధిలోని 12,720 బెడ్లు ఇకపై నేరుగా ప్రభుత్వం కిందకు రానున్నాయి. రాష్ట్రంలో టెర్షియరీ కేర్ బెడ్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. కొత్తగా ప్రారంభించిన 9 మెడికల్ కాలేజీల ద్వారా 1,980 బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ హాస్పిటల్స్, నిమ్స్ విస్తరణ, వరంగల్ హెల్త్ సిటీ పనుల ద్వారా మరో 6,582 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్ లో మొత్తం బెడ్ల సంఖ్య 44,029కి చేరుకోనుంది.

బడ్జెట్​లో మెడికల్ అండ్ హెల్త్ కు కేటాయింపులు

  • టీజీఎంఎస్ఐడీసీ ద్వారా మందుల కొనుగోలుకు రూ.377 కోట్లు
  • మెషినరీల కొనుగోలు కోసం  రూ.175 కోట్లు
  • టీవీవీపీ హాస్పిటల్స్ అప్ గ్రేడేషన్ కోసం రూ.164 కోట్లు
  • శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ కోసం రూ.109 కోట్లు
  • నిమ్స్ విస్తరణ కోసం రూ.50 కోట్లు