
- బీసీ రిజర్వేషన్లు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, గిగ్ వర్కర్స్ బిల్లుపై కూడా
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 10వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన.. సెక్రటేరియెట్ లో మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హై కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టు ఉత్తర్వులతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది. ఇంకోవైపు కోర్టు గడువు, మరోవైపు పాలకవర్గాలు లేకపోవడంతో ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు నిలిచిపోవడం వంటి వాటి నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అధికార పార్టీ తరఫున 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడంపై కూడా ఆలోచన చేస్తున్నారు. అలాగే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో.. రైతులకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
ఇప్పటికే రైతు భరోసా ఇచ్చినందున రైతులకు యూరియా కొరత వంటి ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. చర్యలు తీసుకునేలా సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోగా.. వీటిపైనా కేబినెట్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాజీవ్ యువవికాసం, ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఇతర సంక్షేమ పథకాల అమలుపై కూడా చర్చ జరిగే చాన్స్ ఉంది. అకడమిక్ ప్రారంభంలో ఉన్నందున విద్యాశాఖపైనా చర్చించనున్నారు. గిగ్ వర్కర్స్ సంక్షేమానికి సంబంధించి కార్మిక శాఖ రూపొందించిన బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తీసుకోనున్నట్లు తెలిసింది.