తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలు.. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో 10.2 శాతం వృద్ధి నమోదు

తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలు.. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో 10.2 శాతం వృద్ధి నమోదు
  • జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు
  • రూ.11.29 లక్షలతో రంగారెడ్డి జిల్లా టాప్​
  • హనుమకొండ జిల్లాలో అతి తక్కువగా రూ. 2.37 లక్షలు
  • సోషియో ఎకనామిక్ ​ఔట్ లుక్ ​2026లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర తలసరి ఆదాయం రికార్డుస్థాయిలో రూ.4,18,931కి చేరుకుంది. జాతీయ సగటు రూ.2,19,575తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. గతేడాది రూ.3,80,031గా ఉన్న తలసరి ఆదాయం, కేవలం ఏడాది కాలంలోనే 10.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే నెలకు ఒక్కొక్కరు సగటున రూ.35 వేలు సంపాదిస్తున్నట్లు లెక్క.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌‌‌‌డీపీ) 10.7 శాతం వృద్ధితో రూ.17.82 లక్షల కోట్లకు చేరుకోవడం ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పునకు నిదర్శనం. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం ఏకంగా రూ.11.29 లక్షలుగా ఉండడం దేశ ఆర్థికవేత్తలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ప్రభుత్వం సాగిస్తున్న ‘తెలంగాణ రైజింగ్’ ప్రణాళికలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్నాయని ‘సోషియో ఎకానమిక్​ఔట్​లుక్​2026’ నివేదికలో ప్రభుత్వం స్పష్టం చేసింది. 

హైదరాబాద్​ సెకండ్, సంగారెడ్డి థర్డ్

తలసరి ఆదాయంలో రంగారెడ్డి తర్వాతి స్థానాల్లో హైద రాబాద్, సంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలు నిలిచాయి. రాజధాని హైదరాబాద్ తలసరి ఆదాయం రూ.4,76,679గా ఉండగా, పారి శ్రామిక ప్రాంతమైన సంగారెడ్డి రూ.3,94,587తో మూడో స్థానంలో ఉంది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా రూ.3,81,506 ఆదాయంతో తన పారిశ్రామిక ప్రాధా న్యతను చాటుకుంది. ఖనిజ సంపద కలిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రూ.3,69,420తో ఐదో స్థానంలో నిలిచి పారిశ్రామిక జిల్లాలకు గట్టి పోటీనిస్తోంది. ఈ జిల్లాల్లో ఉపాధి సాంద్రత ఎక్కువగా ఉండడంతో పాటు వేతనాల స్థాయి కూడా జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది.

ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ మైనింగ్ రంగాలు ఈ జిల్లాలను బలోపేతం చేశాయి. వ్యవసాయాధారిత జిల్లాల్లో కూడా తలసరి ఆదాయం నిలకడగా పెరుగుతున్నది. మహబూబ్​నగర్ (రూ.3.36 లక్షలు), ములుగు (రూ.3.35 లక్షలు), నల్గొండ (రూ.3.30 లక్షలు) వంటి జిల్లాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. రూ.2,37,809తో హనుమకొండ, రూ.2,44,245తో జగిత్యాల, రూ.2,47,747తో వికారాబాద్ రాష్ట్రంలో అత్యల్ప తలసరి ఆదాయం నమోదైన జిల్లాలు. ఈ జిల్లాల్లో తలసరి ఆదాయం రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉన్నప్పటికీ, జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది.  

సోషియో ఎకనామిక్ ​ఔట్ లుక్ ​2026లో ప్రధానంశాలు

2025-–26 బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం వ్యయం రూ. 3,04,865 కోట్లుగా ఉంది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.26 లక్షల కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ.36,504 కోట్లు. రెవెన్యూ వ్యయంలో అత్యధికంగా 78.9 శాతాన్ని అభివృద్ధి పనులకే కేటాయించింది.

గత ప్రభుత్వం నుంచి వచ్చిన భారీ అప్పుల భారం రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి పెంచుతోంది. 2023 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకు ప్రభుత్వం రూ.3.19 లక్షల కోట్లు అప్పు తీసుకోగా, అదే సమయంలో పాత అప్పులు, వడ్డీల చెల్లింపులకే ఏకంగా రూ. 3.04 లక్షల కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. అంటే కొత్తగా తెచ్చిన అప్పుల్లో సింహభాగం పాత బకాయిలకే సరిపోతోంది.  

పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి

వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గతేడాది 207 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఈ ఏడాది 236.87 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. వానాకాలం సీజన్‌‌‌‌లోనే సుమారు 14.35 లక్షల మంది రైతుల నుంచి 71.86 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించింది. దీనికి సంబంధించి రూ.17,160 కోట్ల కనీస మద్దతు ధరతో పాటు రూ.1,940 కోట్ల బోనస్‌‌‌‌ను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది.

రైతు భరోసా పథకం కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.8,744 కోట్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. సాగుతో పాటు పశుసంవర్ధక శాఖ కూడా 5.1 శాతం వృద్ధిని సాధించి రైతులకు అదనపు ఆదాయం అందిస్తోంది. అలాగే, సాంకేతికత రంగంలో దూసుకెళ్తున్న రాష్ట్రం దూసుకుపోతున్నది. రాష్ట్ర జీఎస్‌‌‌‌డీపీలో ఈ రంగం వాటా ఏకంగా 68.6 శాతంగా ఉంది. ఐటీ ఎగుమతులు 2024-–25లో రూ. 3.13 లక్షల కోట్లకు చేరుకుని 16.6 శాతం వృద్ధిని కనబరిచాయి. జీఎస్‌‌‌‌డీపీలో ఆరోగ్య రంగానికి కేటాయింపులను 4 శాతం నుంచి 8 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మాతృ మరణాల రేటు 43కు తగ్గడం, శిశు మరణాల రేటు18కి పడిపోవడం వంటివి జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉన్నాయి. 

పారిశ్రామిక రంగంలో గ్లోబల్​ హబ్​గా తెలంగాణ

పారిశ్రామిక రంగంలో తెలంగాణ గ్లోబల్ హబ్‌‌‌‌గా ఎదుగుతోంది. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి రేటు 8.1 శాతంగా నమోదు కాగా, లైఫ్ సైన్సెస్ రంగం రూ.73,360 కోట్ల పెట్టుబడులను ఆక ర్షించింది. గడిచిన రెండేళ్లలో టీజీఐఐసీ (టీజీ ఐఐసీ) ద్వారా 998 పరిశ్రమలకు భూమి కేటా యించగా, రూ. 88,534 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 75,000 మంది యువతకు ఉపాధి లభించింది. ఏరోస్పేస్ రంగంలోనూ తెలంగాణ సత్తా చాటుతోంది.

హైదరాబాద్‌‌‌‌లో ప్రారంభమైన ‘సాఫ్రాన్-సీఎఫ్​ఎం’ ఏరో ఇంజిన్ ఎంఆర్ఓ సెంటర్ ఆసియాలోనే అతిపెద్దది. ఎగు మతుల్లో తెలంగాణ దేశంలోనే 7వ స్థానంలో నిలవగా, ల్యాండ్‌‌‌‌లాక్డ్ రాష్ట్రాల్లో 2వ స్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా ఫార్మా ఉత్పత్తు లు, విమాన విడిభాగాల ఎగుమతుల్లో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ఈ పారిశ్రామిక ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ముచ్చర్ల ప్రాంతంలో 13 వ్యూహాత్మక క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.