ఇవాళ రాజ్యసభకు నామినేషన్ వేయనున్న సింఘ్వీ

 ఇవాళ రాజ్యసభకు నామినేషన్ వేయనున్న సింఘ్వీ

హైదరాబాద్, వెలుగు: పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన అన్ని హక్కులను సాధించేందుకు రాష్ట్రం నుంచి రాజ్యసభలో కాంగ్రెస్  జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్  మను సంఘ్వీ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం రేవంత్  రెడ్డి అన్నారు. అందుకే రాజ్యాంగ, న్యాయ కోవిదుడైన సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానాన్ని కోరామని, తమ సూచనను హైకమాండ్ ఆమోదించిందని సీఎం తెలిపారు. హైదరాబాద్  శివారు నానక్ రామ్ గూడ లోని షెరటాన్  హోటల్ లో ఆదివారం రాత్రి సీఎం అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. వచ్చే నెల 3న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో  తెలంగాణ నుంచి కాంగ్రెస్  తరపున అభిషేక్  మను సింఘ్వీ పోటీ చేస్తుండడంతో ఆయనను రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు పరిచయం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 

సమావేశం తర్వాత మీడియాతో రేవంత్  మాట్లాడారు. పునర్విభజన చట్టంలోని అంశాలను చట్టసభలతోపాటు సుప్రీంకోర్టులో బలంగా వాదన వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. పెండింగ్ లో ఉన్న  సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో, న్యాయస్థానాల్లో అభిషేక్  మను సింఘ్వీ గట్టిగా వాదిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. తమ  ప్రతిపాదనను హైకమాండ్  ఆమోదించినందుకు సీఎల్పీ సమావేశం ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసిందన్నారు. ‘‘రాష్ట్ర పునర్విభజన చట్టం అమల్లో  అనేక రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయి. 2014 పునర్విభజన చట్టాన్ని పదేళ్ల పాటు కేంద్రం అమలు చేయలేదు. ఇప్పుడు వీటిన్నింటినీ అమలుచేసేలా చూసేందుకు సింఘ్వీని ఇక్కడి నుంచి రాజ్యసభకు పంపించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మాజీ ఎంపీ కె.కేశవరావు పెద్ద మనసుతో, క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్  కార్యకర్తగా వ్యవహరించారు. సోమవారం ఉదయం10 గంటలకు అసెంబ్లీలో అభిషేక్ సింఘ్వీ  నామినేషన్  వేస్తారు. అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విభజన హామీలలో తెలంగాణకు మాజీ ప్రధాని మన్మోహన్  సింగ్  చట్టబద్దత కల్పించారు. కానీ, గత పదేళ్లలో ఏవీ అమలు కాలేదు. అభిషేక్  సింఘ్వీ రాష్ట్రం తరపున రాజ్యసభలో ఉంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది” అని సీఎం పేర్కొన్నారు. త్వరలోనే వరంగల్ లో  రైతు కృతజ్ఞత సభ ఉంటుందని, దీనికి కాంగ్రెస్  అగ్ర నేత రాహుల్ వస్తారని సీఎం వెల్లడించారు. అలాగే సెక్రటేరియట్ వద్ద రాజీవ్  గాంధీ విగ్రహావిష్కరణ ప్రోగ్రాం ఈనెల 20 న జరపాలని అనుకున్నామని.. కానీ, వీలుపడలేదన్నారు. ఈ రెండు ప్రోగ్రామ్ లపై త్వరలో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి తేదీలను ఖరారు చేస్తామని సీఎం చెప్పారు.

తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లడం గర్వంగా ఉంది: సింఘ్వీ

రాజ్యసభ అభ్యర్థి అభిషేక్  మను సింఘ్వీ మాట్లాడుతూ... తనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణకు రావాల్సిన హక్కుల విషయం లో తాను తన వాదనను ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటానన్నారు. తెలంగాణ ఎంతో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందని, మహిళా సాధికారత సాధించిన రాష్ట్రం అని కొనియాడారు. బూర్జువా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి నిలిచిన చరిత్ర తెలంగాణది అని, అలాంటి రాష్ట్రం తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. దేశంలో కక్షసాధింపు రాజకీయాలు పెరిగిపోయాయని, తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో కాంగ్రెస్ ను మరింత క్రీయాశీలకంగా పనిచేసేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

నంబర్ వన్ అడ్వొకేట్లలో సింఘ్వీ ఒకరు: మంత్రి ఉత్తమ్

రాష్ట్రం నుంచి రాజ్యసభకు అభిషేక్  మను సింఘ్వీ ఉండడం తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి ఉత్తమ్  కుమార్  రెడ్డి అన్నారు. తెలంగాణ తరపున ఆయన సుప్రీంకోర్టులో ఎన్నో కేసులు వాదించారని, దేశంలోని నంబర్  వన్  అడ్వొకేట్లలో ఆయన ఒకరన్నారు. ఆయన తండ్రి దేశం తరపున బ్రిటన్ లో రాయబారిగా పనిచేశారని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ కోసం సుప్రీంకోర్టులో వాదించిన వ్యక్తి అభిషేక్  మను సింఘ్వీ అని చెప్పారు. ఆయన రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని సీఎల్పీ ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. సీఎల్పీ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్  వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగులేటి, సీతక్క, జూపల్లి కృష్ణారెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ కేకే, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్  వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కాగా.. బీఆర్ఎస్  నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. సాంకేతిక చిక్కులు రావద్దనే ఉదేశంతో వారు హోటల్  షెరటాన్ కు చేరుకున్నా... సమావేశం జరుగుతున్న రూంకు వెళ్లలేదు. వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, కాలె యాదయ్య, తెల్లం వెంకటరావు, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు ఉన్నారు. సీఎల్పీ సమావేశానికి హాజరైన కోదండరాంను అభిషేక్  మను సింఘ్వీకి సీఎం రేవంత్ పరిచయం చేశారు.