2025 వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో ముగ్గురు భారత అథ్లెట్స్ గోల్డ్ మెడల్ గెలిచారు. ఇండియాకు చెందిన మీనాక్షి హుడా, ప్రీతి పవార్ తమ ప్రత్యర్థులపై అద్భుతమైన విజయాలు నమోదు చేసి గోల్డ్ మెడల్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకముందు అరుంధతి కూడా గోల్డ్ మెడల్ గెలుచుకోవడంతో ఈ విభాగంలో మన అథ్లెట్స్ హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ కొట్టారు. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో ప్రపంచ ఛాంపియన్ మీనాక్షి హుడా 48 కిలోల విభాగంలో గోల్డ్ అందుకుంది. గురువారం (నవంబర్ 20) గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఫైనల్స్ లో ఉజ్బెకిస్తాన్ అథ్లెట్ ఫోజిలోవా ఫర్జోనాపై మీనాక్షి 5-0 తేడాతో అలవోక విజయం సాధించింది.
మీనాక్షి గేమ్ ప్లాన్ ముందు ఫర్జోనా తేలిపోయింది. గోల్డ్ మెడల్ గెలుచుకున్న తర్వాత మీనాక్షి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. "ప్రపంచ ఛాంపియన్‌గా మారడం చాలా సులభం. కానీ ఆ హోదాను అగ్రస్థానంలో నిలబెట్టుకోవడం కష్టం. ఇండియాలో జరుగుతున్న టోర్నమెంట్‌లో ఇక్కడి ప్రేక్షకుల సపోర్ట్ అద్భుతంగా ఉంది. ఇది నాకు చాలా ఇన్స్పిరింగ్ గా అనిపించింది. నా దేశం కోసం మరో బంగారు పతకం గెలుచుకోగలిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను". అని మీనాక్షి అన్నారు.
ప్రీతి పవార్ కూడా ఇదే టోర్నమెంట్‌లో 54 కిలోల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. ప్రీతి ఫైనల్‌లో ఇటలీకి అథ్లెట్ సిరిన్ చరాబిని 5-0 తేడాతో చిత్తుగా ఓడించింది. "నేను మళ్ళీ పునరాగమనం చేసి మరింత బలంగా మారాను. భవిష్యత్తులో నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను. వచ్చే ఏడాది ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, 2026లో మళ్ళీ ఆసియా క్రీడలు ఉన్నాయి. నా నెక్స్ట్ టార్గెట్ 2028 లాస్ ఏంజిల్స్. ఈ ఒలింపిక్స్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాను". అని ప్రీతి ఫైనల్ తర్వాత చెప్పుకొచ్చారు.
ఈ ఈవెంట్‌లో ఇండియా హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించడం విశేషం. బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో 70 కిలోల విభాగంలో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జోకిరోవా అజీజాను 5-0 తేడాతో ఓడించి అరుంధతి చౌదరీ గోల్డ్ మెడల్ అందుకుంది. 48, 54, 70 కిలోల విభాగంలో ఇండియాకు మూడు గోల్డ్ మెడల్స్ రావడం విశేషం.
