Abu Dhabi T10 league: పాకిస్తాన్ క్రికెటర్‌తో హర్భజన్ సింగ్ షేక్ హ్యాండ్.. నెటిజన్స్ విమర్శలు

Abu Dhabi T10 league: పాకిస్తాన్ క్రికెటర్‌తో హర్భజన్ సింగ్ షేక్ హ్యాండ్.. నెటిజన్స్ విమర్శలు

భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శలకు గురవుతున్నాడు. పాకిస్తాన్ క్రికెటర్ షానవాజ్ దహానీతో షేక్ హ్యాండ్ ఇవ్వడమే ఇందుకు కారణం. హర్భజన్ ప్రస్తుతం అబుదాబి T10 లీగ్‌లో ఆస్పిన్ స్టాలియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. చివరి ఓవర్‌లో ఆస్పిన్ స్టాలియన్స్‌ కు ఎనిమిది పరుగులు అవసరం. ఈ దశలో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ దహానీ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు నార్తర్న్ వారియర్స్ కు విజయాన్ని అందించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత హర్భజన్ సింగ్ పాకిస్తాన్ క్రికెటర్ దహానీతో షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. 

2025 ఆసియా కప్ క్రికెట్ లో భారత ప్లేయర్స్ పాకిస్థాన్ జట్టుకు షేక్ హ్యాండ్ ఇవ్వని సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్ లు ఆడినప్పటికీ ఒక్క మ్యాచ్ లో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పాకిస్థాన్ ను దూరం పెట్టారు. ఆ తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు కూడా మెన్స్ నే ఫాలో అయింది. భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో పాకిస్థాన్ మహిళలకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అయితే హర్భజన్ మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వడంతో నెటిజన్స్ ఈ సీనియర్ ప్లేయర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్‌లో భారత లెజెండ్స్.. పాకిస్తాన్ లెజెండ్స్‌తో మ్యాచ్ ఆడడానికి నిరాకరించింది. ఈ టీంలో హర్భజన్ కూడా ఉన్నాడు.

►ALSO READ | World Boxing Cup Finals 2025: ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌.. మూడు విభాగాల్లో ఇండియాకు గోల్డ్ మెడల్స్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్పిన్ స్టాలియన్స్‌ పై  నార్తర్న్ వారియర్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన  నార్తర్న్ వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఆస్పిన్ స్టాలియన్స్‌ 10 ఓవర్లలో 110 పరుగులు చేసి ఓడిపోయింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఆస్పిన్ స్టాలియన్స్‌ చేతిలోనే ఉంది. అయితే  చివరి ఓవర్లో దహానీ.. హర్భజన్ సింగ్ వికెట్ తో సహా మూడు వికెట్లు పడగొట్టి వారియర్స్ కు విజయాన్ని అందించాడు. దహానీకి (2/10)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.