తిరుమలలో అన్య మత చిహ్నం స్టిక్కర్‌తో వాహనం.. డ్రైవర్‌, యజమానిపై కేసు

తిరుమలలో అన్య మత చిహ్నం స్టిక్కర్‌తో వాహనం.. డ్రైవర్‌, యజమానిపై కేసు

అమరావతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అన్య మత చిహ్నం స్టిక్కర్‌తో ఉన్న వాహనం తిరుమల కొండపైకి వెళ్లింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు వాహనం డ్రైవర్‌, యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై టీటీడీ శాఖాపరమైన చర్యలు తీసుకుంది. 

2025, నవంబర్ 20వ తేదీ ఉదయం అన్య మతానికి చెందిన స్టిక్కర్ అతికించబడిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాహనంపై తిరుమల ఘాట్ రోడ్డు నుంచి కొండపైకి వెళ్లింది. సమాచారం అందిన వెంటనే సంబంధిత విజిలెన్స్ సిబ్బంది తిరుమల ఫైర్ ఆఫీస్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో వాహనాన్ని గుర్తించి వెంటనే ఆ స్టిక్కర్‌ను తొలగించారు. 

ఈ ఘటనపై టీటీడీ సిబ్బంది తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. వాహన డ్రైవర్ గోబి, వాహన యజమాని‎పై AP చారిటబుల్, హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, ఎండోమెంట్ Act 1987 ( AP CHRIE ACT) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాసు బాబును వెంటనే అలిపిరి విధుల్లో నుంచి తొలగించింది టీటీడీ. అతనిపై విధుల్లో నిర్లక్ష్యానికి సంబంధించి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.