
- పార్టీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు భేటీ
- రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పీసీసీ, ఇతర అంశాలపై చర్చ
న్యూఢిల్లీ, వెలుగు : దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి వెన్నెముఖగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రూ. 2లక్షల రుణమాఫీ భేష్ అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. రైతులు, ఎస్సీ వర్గీకరణ, బీసీల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలను ఆయన అభినందించారు. ప్రజలకు సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను మర్యాదపూర్వకంగా కలిశారు.
మీడియా చిట్ చాట్ అనంతరం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఖర్గేతో సమావేశం అయ్యారు. దాదాపు గంటపాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పీసీసీ చీఫ్ మార్పు, ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం. వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ హామీని అమలు చేసిన తీరును ఖర్గేకు వివరించారు. రుణమాఫీ సక్సెస్ అయిన నేపథ్యంలో వరంగల్‌లో నిర్వహించబోయే రైతు కృతజ్ఞత సభకు సంబంధించి సోనియా, రాహుల్‌గాంధీ రాకపై చర్చించినట్టు సన్నిహితవర్గాలు తెలిపాయి.
తెలంగాణ సెక్రటేరియెట్ ముందు రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ అంశాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, ఇటీవల తాము చేపట్టిన అమెరికా, దక్షిణ కొరియా విదేశీ పర్యటన విజయవంతం అయిన విషయాన్ని వివరించారు. దీంతోపాటు గురువారంతో పీసీసీగా తన మూడేండ్ల సమయం ముగిసిన విషయాన్ని మరోసారి రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కొత్తగా పీసీసీ అధ్యక్ష నియమాకంతోపాటు మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో తీసుకోనున్న నిర్ణయాలపై చర్చించారు.
కేసీ వేణుగోపాల్‌తో భేటీ
కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ చీఫ్ ఖర్గే తో చర్చించిన అంశాలతోపాటు అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటన అంశాలపై డిస్కస్ చేశారు. అలాగే, కొత్త పీసీసీకి సంబంధించి సంస్థాగతంగా తీసుకోనున్న నిర్ణయాలపై విస్తృతంగా చర్చించారు. అంతకుముందు పీసీసీ మార్పు, కేబినెట్ విస్తరణ, ఇతర అంశాలపై చిట్ చాట్ లో సీఎం స్పందించారు. కేబినెట్ విస్తరణ మీడియా సృష్టేనని అన్నారు. దీనిపై చర్చించేందుకు వస్తే పార్టీలోని కీలక నేతలు వచ్చే వారు కదా? అని ప్రశ్నించారు.
వరంగల్‌లో ఏర్పాటు చేసే సభకు సంబంధించి రాహుల్ అపాయిట్‌మెంట్‌ను ఫోన్లో కూడా ఒకే చేసుకోవచ్చని తెలిపారు. రైతు కృతజ్ఞత సభ డేట్‌ను బట్టి సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు వంటి అంశాలు ఉంటాయన్నారు. ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూతో భేటీ కోసమే ఢిల్లీ వచ్చానని, ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా పార్టీ చీఫ్ ఖర్గే అపాయింట్మెంట్ కోరినట్టు తెలిపారు. కాగా, ఈ భేటీల అనంతరం రాత్రి 9:30 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకొని, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పయనమయ్యారు.