బీసీ కోటాపై బీజేపీ స్టాండ్​ ఏంటి : సీఎం రేవంత్​

బీసీ కోటాపై బీజేపీ స్టాండ్​ ఏంటి : సీఎం రేవంత్​
  • 42 శాతం రిజర్వేషన్లపై పది రోజుల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతం
  • దమ్ముంటే పార్లమెంట్ ప్రత్యేక సెషన్​పెట్టి ఆమోదించాలి: సీఎం రేవంత్​
  • మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని కిషన్ రెడ్డి కూడా చెప్పారు
  • కాకపోతే ఎప్పుడు బీసీగా మారారన్న తేదీలోనే తేడా ఉండొచ్చు
  • వచ్చే బడ్జెట్ సెషన్​లో ఎస్సీ వర్గీకరణ బిల్లు 
  • కులగణన నివేదికపై కమిషన్ ​లేదా కమిటీ వేస్తం
  • మార్చి నెలాఖరులోగా వంద శాతం రైతుభరోసా
  • త్వరలో మహిళలకు రూ. 2,500 స్కీమ్​
  • కేబినెట్​ విస్తరణపై రాహుల్​తో చర్చించలేదు
  • ఎవరేమనుకున్నా.. నా పని నేను చేసుకుపోతా
  • ఢిల్లీలో మీడియా చిట్ చాట్​లో వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం తాము పది రోజుల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతామని, దమ్ముంటే పార్లమెంట్​లో ప్రత్యేక సెషన్​పెట్టి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్​రెడ్డి సవాల్​ విసిరారు. బీసీ కోటాపై బీజేపీ స్టాండ్​ ఏమిటో చెప్పాలని డిమాండ్​ చేశారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై పదంటే పదిరోజుల్లో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టి కేంద్రానికి పంపుతాం.. కేంద్రంలోని మోదీ సర్కార్​ మార్చి 10లోపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఈ తీర్మానాన్ని ఆమోదించాలి.

బీసీలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే.. దేశమంతా జనగణనతోపాటు కులగణన చేయాలి. ఆ కులగణనలో ఒకవేళ తెలంగాణలోని బీసీల సంఖ్య పెరిగితే.. అప్పుడు మమ్మల్ని ప్రశ్నించాలి తప్ప గుడ్డిగా విమర్శలు చేయడం కరెక్ట్​ కాదు” అని ఆయన పేర్కొన్నారు. శనివారం ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్  బయలుదేరే ముందు సీఎం రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. 

1931 తర్వాత ఇప్పటివరకు కులగణన జరగలేదని, తమ ప్రజా ప్రభుత్వం చేపట్టిన కులగణన బెంచ్ మార్క్ అని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణనలో తెలంగాణ విధానాన్ని ఫాలోకాక తప్పదన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణనలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్​గా నిలుస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రిజర్వేషన్లు (సీట్లు) అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. ఇలా అమలు చేయడానికి బీఆర్ఎస్​, బీజేపీ కూడా ముందుకు రావాలన్నారు.

కులగణన నివేదికపై కమిషన్

కులగణన సర్వేను పూర్తి శాస్త్రీయంగా చేపట్టామని, దీని ద్వారా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి బాటలు వేయబోతున్నామని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. కులగణన సర్వేలో మిస్ అయిన వాళ్ల కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే చేపడ్తున్నామని తెలిపారు. ‘‘కులగణన నివేదికపై కమిటీ లేదా కమిషన్ ఏర్పాటుచేసి పూర్తిస్థాయిలో స్టడీ చేయిస్తం. రాజకీయ జోక్యానికి తావులేకుండా కులగణన తుది లెక్కలను కమిషన్ ద్వారానే ప్రాసెస్ చేస్తం. 

వర్గాలవారీగా లెక్కలు తేల్చడంలో కులగణన మొదటి దశ పూర్తయింది.. కులగణనపై కమిషన్​ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆయావర్గాలకు ఉద్యోగ, ఉపాధి, ఇతర సంక్షేమ ఫలాలు అందజేయడంతో రెండో దశ పూర్తవుతుంది” అని సీఎం రేవంత్​ వెల్లడించారు. వచ్చే బడ్జెట్ సెషన్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తామన్నారు. ఎస్సీ కులాల నుంచి వచ్చిన కొన్ని అభ్యంతరాలపై అధ్యయనానికి గడువు పెంచామని, అభ్యంతరాలపై కమిషన్ అధ్యయనం చేస్తున్నదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని, ఏక సభ్య కమిషన్ నివేదికను యథాతథంగా అమలు చేస్తామన్నారు. 

ప్రజాసంక్షేమం కోణంలోనే కులగణన

ఇప్పటి వరకు మా శాతం ఇంతని చెప్పే వాళ్లే కానీ... అందుకు ఆధారాలు లేవు. తొలిసారి మా ప్రజాప్రభుత్వం చేపట్టిన కులగణన  సర్వేలో సామాజిక వర్గాల లెక్కలు తేలాయి. గతంలో అందరూ చెప్పినట్లుగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కలిపి రాష్ట్రంలో 85 శాతం ఉన్నట్లు మా సర్వేలో కూడా తేలింది.  ఇక పంచాయితీ ఎక్కడిది?” అని సీఎం రేవంత్​ ప్రశ్నించారు. 

మంచిని గుర్తించకుండా ఏదో విమర్శించాలనే ఉద్దేశంతో బీజేపీ, బీఆర్ఎస్  ఉన్నాయని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు ప్రజలను ఉద్రేకపరిచే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే కులగణనపై రాద్ధాంతం చేస్తున్నాయని తెలిపారు. రాజకీయ కోణంలో కాకుండా... ప్రజా సంక్షేమ కోణంలోనే కులగణన జరిగిందని, తామెక్కడా లెక్క తప్పలేదని ఆయన పేర్కొన్నారు. 

జనం చెప్పిన వివరాలే రికార్డుల్లో నమోదు

తమ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ద్వారా మొత్తం 5 కేటగిరీలుగా విభజించి, ముస్లింలలో ఉన్న బీసీలను కూడా కలిపి చెప్పామని సీఎం తెలిపారు. ఆ ప్రకారం హిందూ, ముస్లిం బీసీలంతా కలిసి 56% మేర ఉన్నారని వివరించారు. తాము ఒక్కో ఎన్యుమరేటర్​కు  150 ఇం డ్లు కేటాయించి, 50 రోజులు పూర్తి శాస్త్రీయంగా సర్వే నిర్వహించి.. జనం స్వయంగా చెప్పిన వివరాలే రికార్డుల్లో నమోదు చేయించామని, ఇందులో ఒక్క తప్పు ఉన్నా చూపించాలని ప్రతిపక్షాలకు ఆయన సవాల్ విసిరారు.  

నాడు సబితా, తలసాని ఏ పార్టీలో గెలిచి మంత్రులయ్యారు?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. అయితే కోర్టులు చేసేపనిని కేటీఆర్ చేయాలనుకుంటున్నారని, ఉప ఎన్నికలు వస్తాయో రావో ఆయనే చెప్పేస్తున్నారని సీఎం అన్నారు. 

రాజ్యాంగంలో ఉన్నదే కోర్టులు అనుసరిస్తాయని తెలిపారు.  ‘‘గతంలో సబితా ఇంద్రారెడ్డి ఏ బీఫామ్ మీద గెలిచి, ఎవరి మంత్రివర్గంలో పనిచేశారు?  2014 లో ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. మంత్రిగా పనిచేసింది ఎవరి ప్రభుత్వంలో?’’ అని ఆయన ప్రశ్నించారు. ఒక్కొక్కరిపై అప్పుడు స్పీకర్ కు ఫిర్యాదులు అందాయని తెలిపారు.  ఫిరాయింపులపై నిర్ణయం తన పరిధిలోనిది కాదని.. అసెంబ్లీ స్పీకర్​కు నిర్ణయాధికారం రాజ్యాంగం ఇచ్చిందని...ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్తుందో చూద్దామని ముఖ్యమంత్రి అన్నారు. 

మార్చి నెలాఖరులోగా వందశాతం రైతుభరోసా

రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ ఇప్పటికే ప్రారంభమైందని, దశలవారీగా అందరికీ ఇస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, భూములు బదలాయించిన, రోడ్ల కిందపోయిన భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. మార్చి నెలాఖరులోపు  వందశాతం రైతుభరోసా అందజేస్తామన్నారు. కేసీఆర్ రూ.10 వేలు ఇస్తే, తాము రూ.12 వేలు ఇస్తున్నామని వివరించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే హామీని త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు.   

మంత్రివర్గ విస్తరణపై అన్నీ ఊహాగానాలే  

మంత్రివర్గ విస్తరణపై అన్నీ ఊహాగానాలేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘రాహుల్​గాంధీతో మంత్రివర్గ విస్తరణపై నేనొక్కడినే ఎందుకు మాట్లాడుతాను?  పీసీసీ అధ్యక్షుడు, ఇతర మంత్రులు కూడా నా వెంట ఉంటారు కదా?’’ అని విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపైనే రాహుల్ గాంధీతో చర్చించానని.. మంత్రివర్గ విస్తరణ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.

కులగణనపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీనిపై రాహుల్ గాంధీకి సమగ్రంగా వివరించానని తెలిపారు.  యమునా నదిని ప్రక్షాళన చేస్తామని బీజేపీ చెప్తున్నదని, మరి మూసీని ప్రక్షాళన చేస్తామంటే కేంద్రం ఎందుకు సహకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్  సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.  

రాహుల్​ గాంధీతో గ్యాప్​ ఊహాగానాలే

తన గురించి ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసిన తాను పట్టించుకోనని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ‘‘ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గైడెన్స్ మేరకే కులగణన సహా అన్ని కార్యక్రమాలు అమలుచేస్తున్నాం. రాహుల్ గాంధీతో నాకు గ్యాప్ ఉందనే వార్తలన్నీ ఊహాగానాలే” అని తెలిపారు. పార్టీ అగ్రనేత అయిన ఆయన  అజెండాను  నెరవేర్చడమే తన పని అని చెప్పారు. ‘‘నేను కొందరికి నచ్చకపోవచ్చు. నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు. కానీ నా పని నేను చేస్తున్నాను. 

నన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను. కాంగ్రెస్ తరఫున ప్రజలకు హామీ ఇచ్చింది నేను, అమలు చెయ్యకపోతే అడిగేది నన్నే. కొంతమంది నాపై అబద్ధపు ప్రచారాలు చేసి,  పైశాచిక ఆనందం పొందుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. కేబినెట్ విస్తరణ తన ఒక్కడి నిర్ణయం కాదని తెలిపారు. పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కూడా కొందరు పైశాచిక ఆనందం కోసం ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంత్ సేవాలాల్ ఆధ్యాత్మిక మార్గదర్శి: సీఎం రేవంత్

బంజారా జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ మహారాజ్ నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని శనివారం ఆయన చిత్రపటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్ లోని సీఎం అధికారక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రధాని స్థాయిని తగ్గించి మాట్లాడలే

ప్రధాని మోదీ విషయంలో తాను ఎటువంటి తప్పుడు కామెంట్ చేయలేదని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘ప్రధాని హోదాను తగ్గించి లేదా అగౌరవపరిచి మాట్లాడలేదు. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నాను. బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్ రెడ్డి కూడా అదే మాట చెప్పారు. కాకపోతే ఎప్పుడు బీసీగా మారారు అన్న తేదీ,  సమయం విషయంలోనే తేడా ఉండొచ్చు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన తేదీనే నేను అంగీకరి స్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్​ సర్వే తప్పులతడక

కేసీఆర్ అప్పట్లో కాలేజీ స్టూడెంట్లతో చేయించిన సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడక. ఆ సర్వేలో కేవలం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అనే నాలుగు కేటగిరీలనే చూపారు. అందులో బీసీలు 51% శాతం, ఎస్సీలు 18%, ఎస్టీలు 10% శాతం, మిగతావాళ్లు ఓసీలుగా ఉన్నారు. 

మరీ మైనార్టీలు ఎక్కడికి పోయారు? ఈ  సర్వేలో ఎస్సీల్లో 82 ఉప కులాలు ఉన్నట్లు చూపారు. కానీ ఉన్నవి 59 ఉప కులాలే. స్పెల్లింగ్ తప్పులను కూడా మరో ఉపకులంగా చూపెట్టారు. కేసీఆర్ చేయించిన ఆ సర్వేను నాడు అసెంబ్లీలో పెట్టలేదు.. కేబినెట్​ అప్రూవ్ కూడా చేయలేదు.- సీఎం రేవంత్​ రెడ్డి