సీఎంవో ప్రక్షాళన .. పనితీరు మారని ఆఫీసర్ల బదిలీ

సీఎంవో ప్రక్షాళన  .. పనితీరు మారని ఆఫీసర్ల బదిలీ
  • ఇటీవల ఒకేసారి ముగ్గురు సెక్రటరీల ట్రాన్స్​ఫర్​
  • త్వరలోనే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా..!

హైదరాబాద్, వెలుగు: పరిపాలనలో రాష్ట్ర సర్కార్​ ప్రక్షాళన మొదలుపెట్టింది. 15 నెలలుగా అన్ని పరిశీలిస్తూ వచ్చిన సీఎం రేవంత్​రెడ్డి.. సీఎంవో నుంచే మార్పును స్టార్ట్​ చేశారు. ఫైల్స్ పెండింగ్, అధికారుల పనితీరులో జాప్యం, సమన్వయ లోపాల నేపథ్యంలో ఆఫీసర్ల బదిలీలు తప్పవని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపింది. ఫీల్డ్​ విజిట్​ చేయని, పనితీరు సరిగ్గా లేని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సైతం త్వరలోనే బదిలీ చేయనున్నట్లు తెలుస్తున్నది. 

ఇప్పుడు బదిలీ చేస్తే మళ్లీ ఏడాది, ఏడాదిన్నర వరకు ట్రాన్స్​ఫర్ల జోలికి వెళ్లకుండా పూర్తిగా పాలనపైనే ఫోకస్​ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒకేసారి ముగ్గురు సెక్రటరీలను బదిలీ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజును సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్‌‌‌‌‌‌‌‌గా ఉన్న జయేశ్ రంజన్‌‌‌‌‌‌‌‌కు సీఎంవోలో పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల అభివృద్ధి బాధ్యతలు అప్పగించారు. సీపీఆర్వో అయోధ్య రెడ్డి బోరెడ్డిని కూడా ప్రభుత్వం ఆర్టీఐ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా ప్రతిపాదించింది. సీఎంవోలో మరో ఇద్దరు సెక్రటరీల పనితీరుపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. వివిధ శాఖల హెచ్​వోడీలతో సమన్వయం చేసుకోవడం లేదనే చర్చ జరుగుతున్నది.

 ఆ ఇద్దరు సెక్రటరీలు చూస్తున్న  రెండు శాఖలు కూడా సీఎం దగ్గరనే ఉండటంతో.. కిందిస్థాయిలో పెద్ద ఎత్తున పెండింగ్​ ఫైల్స్​ పెరగడంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆ ఇద్దరు కూడా తీరు మార్చుకోకపోతే బదిలీ వేటు తప్పదనే చర్చ జరుగుతున్నది. 

సీఎంవోలో మార్పులు ఇట్ల..!

సీఎంవోలో సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా నియమించేందుకు ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆయన ఇప్పటికే సీఎంవోలో తన చాంబర్ ను ఖాళీ చేసి మదర్​ డిపార్ట్​మెంట్​ ఫారెస్ట్​ కు వెళ్లారు. ఇక సీఎం సెక్రటరీగా ఉన్న .. ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసీంను రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్‌‌‌‌‌‌‌‌గా బదిలీ చేసింది. అలాగే, సీఎంవో సంయుక్త కార్యదర్శిగా ఉన్న సంగీత సత్యనారాయణను వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా నియమించింది. ఇక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం చర్చనీయాంశంగా మారింది.

 గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ శాఖలో కీలక పాత్ర పోషించిన జయేశ్ రంజన్​.. ప్రస్తుత ప్రభుత్వంలోనూ స్పెషల్ సీఎస్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్నారు. ఆయనను సీఎంవోలోకి తీసుకొచ్చి, ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ సెల్‌‌‌‌‌‌‌‌తోపాటు స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) విభాగం సీఈవోగా నియమించారు. ఈ నియామకం రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల అభివృద్ధికి ఊతం ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు. 

వారంలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు!

సీఎంఓ మార్పులతోపాటు, జిల్లా కలెక్టర్ల బదిలీలపైనా చర్చ జరుగుతున్నది. పలు జిల్లాల్లో కలెక్టర్ల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ముఖ్యంగా సంగారెడ్డితో పాటు ఇతర ముఖ్యమైన జిల్లాల్లో కొత్త కలెక్టర్ల నియామకం జరిగే అవకాశం ఉందని,  ఈ బదిలీలు రాష్ట్రంలో స్థానిక పాలనను మరింత బలోపేతం చేసే దిశగా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. అయితే భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లతో కొంత లేట్ చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. సీఎం గ్రీన్ సిగ్నల్​ ఇస్తే ఈ వారం రోజుల్లోనే కలెక్టర్లు, ఎస్పీల బదిలీల ప్రక్రియ పూర్తి కానుంది.